న్యూఢిల్లీ: గత వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ అవకాశాలు దెబ్బకొట్టే విధంగా భారత జట్టు ప్రవర్తించిందని ఆ దేశ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ అన్నాడు. పాక్ సెమీస్ కు అర్హత సాధిస్తే.. కోహ్లీసేనకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ప్రదర్శనలో తేడా చూపెట్టిందన్నాడు. అందుకే కచ్చితంగా గెలుస్తుందనుకున్న ఇంగ్లండ్ తో మ్యాచ్ లో కావాలని ఓడిపోయిందని విమర్శించాడు. ‘ఇంగ్లండ్ తో లీగ్ మ్యాచ్ లో భారత్ చెత్తగా ఆడింది. వాళ్లు సత్తా మేరకు ఆడితే కచ్చితంగా గెలివాళ్లు. కానీ అలా చేయలేదు.
ఆ మ్యాచ్ లో టీమిండియా ఓడితే.. పాక్ సెమీస్ కు అర్హత సాధించదు. ఈ సమీకరణంతో కోహ్లీసేన తక్కువ స్థాయి ప్రదర్శన చేసింది. దీనికి భారత్ కు ఐసీసీ జరిమానా విధించాలి’ అని రజాక్ పేర్కొన్నాడు. నాణ్యమైన బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ ప్రకారం బంతులు వేయకుండా, సిక్స్ లు కొట్టే బ్యాట్స్ మెన్ డిఫెన్స్ ఆడుతుంటే ఎలా అర్థం చేసుకోవాలన్నాడు. కావాలనే అలా చేస్తున్నారని ఎవరిని అడిగినా చెబుతారన్నాడు. ఇలా చేయడం వల్ల భారత్ లబ్ది పొందిందని రజాక్ వ్యాఖ్యానించాడు.