Breaking News

నల్లమల పొడ..మొనగాడు..రంకె వేసే రౌద్రం.. పులిచారలు..

నల్లమల పొడ.. మొనగాడు

నల్లమల పొడ..మొనగాడు..రంకె వేసే రౌద్రం.. పులిచారలు..

మార్కెట్‌‌లో మంచి గిరాకీ…,ఇవీ ప్రత్యేకతలు…

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: రంకె వేసే రౌద్రం పులిచారలు బారెడు కొమ్ములు, మూరెడు మూపురం, నేలను తాకే గంగడోలు.. కొండనైనా లాగేంత కండల బలం కాడి కడితే చాలు ఎంతటి బరువునైనా  సునాయాసంగా లాగేసే బలిష్టం ఎంత దూరమైన దౌడ్‌‌తీసే ధీరత్వం.

పెద్ద పెద్ద గుట్టలను కూడా ఈజీగా  ఎక్క కలిగిన బలం.. ఇలా ఎన్నో విశిష్ట జన్యుపరమైన లక్షణాలు నాగర్‌‌కర్నూల్‌‌జిల్లా నల్లమల మారుమూల తూర్పు పొడజాతి పశువుల సొంతం.

ఈ అరుదైన జ్యాతి పశువులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికే ఖ్యాతి తెచ్చిపెట్టాయి. నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా పొడ జాతి పశువులు మనకు దర్శనమిస్తుంటాయి. అలాంటి వాటిని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన  తర్వాత అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. తెలంగాణ జీవవైవిధ్య సంస్థతో పాటు కోనేరు స్వచ్ఛంద సేవా సంస్థలు        వీటికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు తీవ్రంగా కృషిచేశాయి.

మార్కెట్‌‌లో మంచి గిరాకీ..
ప్రత్యేక విశిష్టతలు కలిగిన పొడ తూరుపు పశువులకు మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. పెద్ద పశువులకు జతకు రూ.80వేలకుపైగా పలుకుతాయి. వీటిని ప్రసిద్ధిచెందిన కురుమూర్తి జాతర ఉత్సవాల్లో బేరానికి పెడతారు.

ఈ పశువులను కొనడానికి కర్ణాటక, అనంతపురం, మంత్రాలయం, గురుమిట్కల్‌, రాయచూర్‌‌తదితర ప్రాంతాల నుంచి రైతులు వస్తారు. కోడెను రూ.25వేల నుంచి రూ.30వేలకు అమ్ముతుంటారు.

అరుదైన గుర్తింపు
భారత వ్యవసాయ పరిశోధన మండలిలో భాగమైన భారత పశు జన్య వనరుల మండలి ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుర్తింపు ఇచ్చింది. ప్రభుత్వం కృషి ఫలిస్తే  తెలంగాణలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన తొలి పశువులుగా అవకాశం దక్కుతుంది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌‌లో ఒంగోలు గిత్త, తమిళనాడులో పుల్లికులం, కర్ణాటకలో హల్లికర్‌, కేరళలో పెచ్చూరు జాతి పశువుల మాదిరిగానే తెలంగాణలోని నల్లమల తూర్పు పొడజాతి పశువులకు విశిష్టత ఖ్యాతి దక్కింది.

ఇవీ ప్రత్యేకతలు
నాగర్ కర్నూల్‌‌జిల్లా అమ్రాబాద్ మండలం పదర వంకేశ్వరం తదితర ప్రాంతాల్లో సుమారు 11,500 ఈ జాతి సంపద ఉన్నట్టు పశుసంవర్ధకశాఖ అంచనా.. నల్లమల ప్రాంత రైతులు ఇక్కడి ఈ మచ్చల జాతి పశువులతోనే తాతముత్తాల నుంచే వ్యవసాయం చేస్తున్నారు.

అమ్రాబాద్‌‌మండలంలోని లక్ష్మాపూర్‌‌తండా నుంచి నల్లమల ప్రాంతంలోని దట్టమైన వజ్రాలమడుగు, గుండం, కొల్లం, గుజనేనిగడ్డ, మల్లెలరేవు, చిన్నమాల్‌‌బండ, బోల్‌‌గెట్టి, ఆరంమాన్‌‌చేను, ముత్యాలమ్మగడ్డి తదితర ప్రాంతాలకు మేతకు తీసుకెళ్తుంటారు.

అలాగే మన్ననూర్‌, చిట్లంకుంట, చెన్నంపల్లి, వటవర్లపల్లి, ఉడిమిళ్ల, పదర, లింగాల, బల్మూర్ ‌‌ప్రాంతాల్లో ఈ అరుదైన జాతి పశువులు కనిపిస్తాయి.

– ఎరుపు గోధుమ రంగు మచ్చలు కలిగిన ఈ గిత్తలకు కొమ్ములు నిటారుగా ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత, గజగజ వణికించే చలిలోనూ ఉత్సాహంగా పనిచేస్తాయి.

వీటి కాళ్ల గిట్టలు దృఢంగా ఉండడంతో ఎంత పనిచేసినా అలసిపోవు. ఆవులు పగలంతా వ్యవసాయం చేసిన తర్వాత కూడా ఒక్కపూటకు 3 నుంచి 5 లీటర్ల పాలు ఇస్తాయి.

ఇలా పాడితో  పాటు వ్యవసాయానికి అనుకూలంగా ఉండడంతో వీటిని ఎంతరేటు పెట్టయినా సరే కొనేందుకు రైతులు ఆసక్తి చూపుతుంటారు.
– దొర పొడలు, ఎర్ర పొడలు, తెల్ల పొడలు, పుల్ల బట్ట, తెల్ల బట్ట, పాల బట్ట, ఎరుపు, నలుపు రకాల పశువులున్నాయి. ఈ జాతి పశువులు వర్షం రాకను రెండు, మూడు రోజుల ముందుగానే గుర్తిస్తాయని పెంపకందారులు చెబుతున్నారు.

ఇవి బురదలో, రాతి నేలలతో పాటు కొండలు, గుట్టల్లోను సనాయాసంగా నడుస్తాయి. నీటిలో వేగంగా ఈదగలడం వీటి ప్రత్యేకత. బురదలో సైతం సులువుగా దున్నగలవని రైతులు చెప్తున్నారు.

– ఈ మచ్చల పశువులు గట్టిదనానికి కారణమైన జన్యులక్షణం పొడి వాతావరణంలో కూడా అవలీలగా బతికేలా ఉంటుందని జీవవైవిధ్య సంస్థ అధ్యయనంలో తేలింది. ఈ జాతి పశువులు వర్షం రాకను, ఆపదను కూడా ముందే పసిగట్టి తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి తెలిపారు.

ఈ జాతిని అంతరించిపోకుండా కాపాడేందుకు కృషి చేస్తున్నారు. వీటికి  అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో  ఇక్కడి పశువులకు డిమాండ్ పెరిగి వీటిని పోషిస్తున్న రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది.