ముంబై: వికెట్ల వెనకాల కీపింగ్‌లో మాజీ కెప్టెన్ ధోనీని అందుకోవడం చాలా కష్టమని కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. మహీ ఫ్యాన్స్ అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయని వాటిని అధిగమించాలనుకోవడం చాలా ఒత్తిడితో కూడుకున్నదని చెప్పాడు. 2014లో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ధోనీ.. అప్పటి నుంచి లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు.
అయితే లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ తర్వాత ఆటకు దూరంగా ఉండడంతో.. ఈ ఏడాది జనవరిలో ఆసీస్, న్యూజిలాండ్ సిరీస్ లో రాహుల్ వికెట్ కీపింగ్ చేశాడు. టీమిండియాకు కీపింగ్ చేసేటప్పుడు చాలా నెర్వస్‌గా ఫీలవుతా. ఎందుకంటే క్రౌడ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఏమాత్రం తడబడినా.. ధోనీ స్థానాన్నీ భర్తీ చేయలేరని ప్రతిఒక్కరూ భావిస్తారు. లెజెండరీ మహీ ప్లేస్‌ను భర్తీచేయాలంటే చాలా ఒత్తిడి జయించాలి.
ఎందుకంటే స్టంప్స్ వెనుకాల ధోనీని చూసినవారు మరొకరని అంగీకరించడానికి అంతగా ఇష్టపడరు. అందుకే వాళ్ల అంచనాలను అందుకోవాలంటే చాలా శ్రమించాలి’ అని రాహుల్ వివరించాడు. బ్యాట్స్ మెన్గా సేవలందిస్తున్నా.. కీపింగ్‌కు ఎప్పుడూ దూరంగా లేనన్నాడు. ఐపీఎల్, కర్ణాటక రంజీ టీమ్ లకు రెగ్యులర్‌గా కీపింగ్ చేస్తున్నానని చెప్పాడు. జట్టుకు అవసరమైన పక్షంలో ఏ సేవలందించడానికైనా తాను సిద్ధంగా ఉంటానని రాహుల్ స్పష్టం చేశాడు.