న్యూఢిల్లీ: డీఆర్‌ఎస్‌లను అంచనా వేయడంలో ధోనీని మించినోళ్లు లేరని మాజీ ప్లేయర్ వసీమ్ జాఫర్ అన్నాడు. ఒకవేళ ధోనీ సాయం లేకపోతే రివ్యూల్లో విరాట్ కోహ్లీ విజయవంతం కాలేడన్నాడు. ‘మహీ కీపర్ మాత్రమే కాదు. వికెట్ల వెనక ఉండి బంతిని చాలా నిశితంగా గమనిస్తాడు. బంతి గమనాన్ని అంచనా వేయడంలో చాలా నిష్ణాతుడు. అందుకే డీఆర్ఎస్ విషయంలో అంత కచ్చిమైన నిర్ణయాలు తీసుకుంటాడు. తన అంచనా కరెక్ట్ అని తేలితే ఒక్క క్షణం కూడా ఆలోచించడు. ఈ విషయంలో కోహ్లీ చాలా వెనకబడి ఉన్నాడు. ధోనీ సాయం లేకపోతే రివ్యూలు తీసుకోవడంలో కోహ్లీ విఫమవుతాడు’ అని జాఫర్ వెల్లడించాడు.
మహీ రిటైర్మెంట్ విషయంపై కూడా జాఫర్ స్పందించాడు. ‘ధోనీ ఓ దిగ్గజం. అతని గురించి అందరు అంచనాలు వేయడం కూడా సహజమే. కానీ టీమిండియాకు ధోనీ అవసరం చాలా ఉంది. అందుకే ఐపీఎల్లో ఆడి జాతీయ జట్టులో చోటు సంపాదించాలనుకున్నాడు. చెన్నై టీమ్ నెట్ ప్రాక్టీస్‌లోనూ పాల్గొన్నాడు. కానీ దురదృష్టం కరోనా రూపంలో వచ్చింది. ఏదేమైనా ఇప్పటికీ టీ20ల్లో ధోనీ అత్యుత్తమ క్రికెటర్. మరికొంత కాలం అతని సేవలు అవసరం. డీఆర్ఎస్తో పాటు చాలా విషయాల్లో కోహ్లీకి మహీ అవసరం ఉంది’ అని జాఫర్ వ్యాఖ్యానించాడు.