Breaking News

ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వద్దు

ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వద్దు

 సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, సంబంధిత అధికారులు అలసత్వం, పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. బుధవారం ఆయన వనపర్తి కలెక్టరేట్​ నుంచి మహబూబ్​నగర్​, నాగర్​కర్నూల్​, జోగుళాంబ గద్వాల, రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల కలెక్టర్లు, అగ్రికల్చర్​, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని తప్పనిసరిగా కొనాలని సూచించారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేలా సరైన పద్ధతులు నేర్పించాలన్నారు. శనగల కొనుగోలుపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

కరోనా అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్​ ఈ.శ్రీధర్​ జిల్లా పరిస్థితులను వివరించారు. జిల్లాలో 200 ధాన్యం  కొనుగోలు కేంద్రాలను గుర్తించామని, ఇప్పటివరకు 15,250 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని చెప్పారు. జిల్లాకు 23లక్షల గన్నీ బ్యాగుల అవసరం ఉందన్నారు. మాచినేనిపల్లి వద్ద ఖాళీగా ఉన్న 50 ఎకరాల ప్రభుత్వ భూమిలో మామిడి హోల్ సేల్ మార్కెట్ ఏర్పాటుకు వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రతిపాదనలను పంపించాలని మంత్రి కలెక్టర్ ను ఆదేశించారు. సమావేశంలో అడిషన్​ కలెక్టర్లు మనుచౌదరి, హనుమంత్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి బైరెడ్డి, సింగారెడ్డి మార్కెటింగ్ అధికారి బాలమణి, జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, సివిల్ సప్లై మేనేజర్ బాలరాజు, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ రావు, సీపీవో మోహన్ రెడ్డి పాల్గొన్నారు.