Breaking News

డైలామాలోనే టీ20 ప్రపంచకప్

ముంబై: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ ఉంటుందా? ఉండదా? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ అంశంపై నేడు ఐసీసీ కీలక సమావేశం జరుగబోతున్నది. మెగా ఈవెంట్ను రద్దు చేస్తారని కొందరు, వాయిదా వేస్తారని మరికొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజాలు లేవని ఐసీసీ కొట్టి పారేస్తున్నది. ఇప్పటికే 2021 ఎడిషన్ హక్కులు భారత్ వద్ద ఉండడం, దీనికితోడు పన్ను మినహాయింపు విషయంలో బీసీసీఐ, ఐసీసీకి మధ్య వివాదం ముదరడంతో ఎలాంటి నిర్ణయాలు వస్తాయోనని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికైతే ఆసీస్​లో టీ20 ప్రపంచకప్​ను వాయిదా వేసినట్లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఐసీసీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. కరోనా ముప్పు ఉండడంతో పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నామన్నారు. ఒకవేళ టీ20 ప్రపంచకప్ వాయిదా పడినా, రద్దుచేసినా.. ఆ విండోలో ఐపీఎల్ జరుగుతుందని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఏదేమైనా ఐసీసీ సమావేశం తర్వాత అన్ని అంశాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఐసీసీ చైర్మన్​గా శశాంక్ మనోహర్ పదవీకాలాన్ని పొడిగించే అవకాశాలు కనిపించడం లేదు. ఐసీసీ, బీసీసీఐ మధ్య పన్ను మినహాయింపు వివాదం నడుస్తున్నా.. 2021 టీ20 ప్రపంచకప్ భారత్లోనే జరుగుతుందని ఇండియా పూర్తి నమ్మకంతో ఉంది.