న్యూఢిల్లీ: వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స తర్వాత టెస్ట్ లు ఆడడం తన ముందున్న అతిపెద్ద సవాలని టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలకమైన తాను.. టెస్ట్ ల్లో ఆడేందుకు తొందరపడబోనని చెప్పాడు. ‘ఏ రకంగా చూసిన టెస్ట్ ఫార్మాట్లో నేను బ్యాకప్ సీమర్ నే. ఎవరైనా గాయడినా, టీమ్ సమతుల్యం కోసమే నన్ను ఎంచుకుంటారు. అదే వన్డే, టీ20 ఫార్మాట్ లో అలా కాదు. ఆల్ రౌండర్ గా నాపాత్ర చాలా పెద్దది. అందుకే నా దృష్టి ఎక్కువగా వాటిపైనే ఉంటుంది. ఈ సమయంలో టెస్ట్ లు ఆడడం నాకు సవాలే అయినా.. దాని కోసం ఎక్కువ రిస్క్ తీసుకోను’ అని హార్దిక్ పేర్కొన్నాడు.
స్ట్రెచర్ పై తీసుకెళ్తుంటే..
2018 ఆసియా కప్ లో గాయపడడంతో తన కెరీర్ ముగిసినట్లేనని భావించానని హార్దిక్ వెల్లడించాడు. స్ట్రెచర్ పై బయటకు తీసుకెళ్తుంటే.. ఓ పది నిమిషాలు అంతా చీకటైపోయిందన్నాడు. ‘పాక్ తో మ్యాచ్ లో నేను వెన్ను నొప్పితో విలవిలలాడిపోయాను. కనీసం నిలబడే పరిస్థితి కూడా లేదు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. స్ట్రెచర్ పై బయటకు తీసుకెళ్తున్నారు. శరీరం విశ్రాంతి కోరుకుంటుందని అర్థమైంది. కానీ గాయంతో కెరీర్ ముగిసిపోయిందనుకున్నా. నొప్పి తగ్గినా.. కోలుకుంటానో లేదో అనే భయం వెంటాడేది. కానీ అదృష్టం కొద్ది మళ్లీ క్రికెట్లోకి వస్తున్నా’ అని పాండ్యా తెలిపాడు. కష్టకాలంలో రికీ పాంటింగ్ తనకు చాలా అండగా నిలబడ్డాడని కృతజ్ఞతలు తెలిపాడు. అతన్ని ఓ తండ్రిలాగా భావిస్తానని చెప్పాడు. కెప్టెన్ విరాట్, కోచ్ రవిశాస్త్రి, ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్.. తనకు ప్రతి అంశంలో చాలా స్వేచ్ఛ ఇచ్చారని, తన కెరీర్ ఎదుగుదలకు చాలా తోడ్పడ్డారని పాండ్యా వివరించాడు.
- June 4, 2020
- క్రీడలు
- HARDIKPANDYA
- TEAM INDIA
- రవిశాస్త్రి
- రాహుల్ ద్రవిడ్
- Comments Off on టెస్టుల్లో నేను బ్యాకప్ సీమర్ నే..