న్యూఢిల్లీ: భారీ లక్ష్యాలను ఛేదించడంలో విరాట్ కోహ్లీని మించిన మొనగాడు లేడన్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ విషయంలో సచిన్ కంటే కోహ్లీయే బెస్ట్ అన్న పీటర్సన్ కు నేడు బ్రాడ్ హాగ్ తోడయ్యాడు. కాకపోతే సచిన్ స్థానంలో ఈసారి రోహిత్ వచ్చాడు. విరాట్, రోహిత్లో మెరుగైన బ్యాట్స్మెన్ ఎవరనే ప్రశ్నకు హాగ్ తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు. ఛేదన పరంగా చూస్తే కోహ్లీయే ఓ మెట్టు పైన ఉంటాడని చెప్పాడు. అయితే రోహిత్, కోహ్లీని ఒకరితో ఒకర్ని పోల్చడం సరైంది కాదన్నాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్, కోహ్లీ సూపర్ ప్లేయర్లు. వీళ్లలో ఏ ఒక్కర్ని తక్కువగా అంచనా వేయలేం. కాకపోతే భారీలక్ష్యాలు ఉన్నప్పుడు కోహ్లీ చాలా నిలకడగా ఆడతాడు. భారత్ రెండో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గోడలా నిలబడతాడు. ఫలితం తీసుకొస్తాడు. ఈ విషయంలో రోహిత్తో పోల్చలేం. ఎందుకంటే జట్టులో ఈ ఇద్దరి బాధ్యతలు వేర్వేరు. కొత్త బంతి బౌలర్లపై దూకుడుగా ఆడడం రోహిత్ బాధ్యత. ఫీల్డింగ్ నిబంధనలను ఉపయోగించుకోవాలి కాబట్టి అలా ఆడాల్సిందే. కానీ విరాట్ ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉండాలి. కాబట్టి నిలకడ తప్పదు’ అని హాగ్ విశ్లేషించాడు.
- June 5, 2020
- క్రీడలు
- SACHIN
- VIRATKOHLI
- బ్రాడ్ హాగ్
- రోహిత్
- Comments Off on ఛేజ్ కింగ్.. విరాటే