Breaking News

చెరో లక్ష.. మిగతా ‘ఆ’ కలెక్టర్​కే!

చెరో లక్ష.. మిగతా ‘ఆ’ కలెక్టర్​కే!

  • ఏసీబీ అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు
  • మెదక్​ అడిషనల్​ కలెక్టర్ ​ఇంట్లో కీలకపత్రాలు స్వాధీనం
  • నర్సాపూర్ ​ఆర్డీవో ఇంట్లో అర కిలో బంగారు ఆభరణాలు

సారథి న్యూస్, మెదక్: రూ.లక్షల్లో జీతం.. ఖరీదైన కారు.. సౌకర్యవంతమైన జీవనం.. ఇవి చాలవనుకోవచ్చు కాబోలు!. అత్యాశే అడిషనల్ ​కలెక్టర్ ​స్థాయి అధికారిని అవినీతిలోకి తోసింది. ఓ భూమికి సంబంధించి ఎన్ వోసీ ఇచ్చేందుకు రూ.1.12 కోట్లు లంచంగా డిమాండ్ ​చేసిన మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ​నగేష్ ​అవినీతి గుట్టురట్టయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బుధవారం ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు నగేష్​తోపాటు అవినీతి బాగోతంతో సంబంధం ఉన్న నర్సాపూర్ ​ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ ​సత్తార్, భూ సర్వే కార్యాలయం జూనియర్​ అసిస్టెంట్ ​వసీం, అడిషనల్​ కలెక్టర్ నగేష్​ బినామీ జీవన్ గౌడ్​పై కేసు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం వివరాలను వెల్లడించారు.

సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు

ఏం జరిగిందంటే..
హైదరాబాద్​ శివారులోని శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తి మరో నలుగురు వ్యక్తులు కలిసి మెదక్ జిల్లా నర్సాపూర్ ​మండలం చిప్పల్​తుర్తిలో సర్వే నం.59/31, 59/40, 58/1, 58/2లో ఉన్న 112.21 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కాగా, ఆ భూమి 22ఏ ప్రకారం ప్రభుత్వ భూమి కావడంతో రిజిస్ట్రేషన్​ చేయడానికి నిరభ్యంతర పత్రం(ఎన్​వోసీ) అవసరం. దీంతో లింగమూర్తి నిరభ్యంతర పత్రం కోసం జులై 22న నర్సాపూర్​ తహసీల్దార్ ​సత్తార్​కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన సదరు దరఖాస్తు ప్రతిని జులై 23న మెదక్​కలెక్టర్ ​ధర్మారెడ్డి, నర్సాపూర్ ​ఆర్డీవో అరుణారెడ్డికి పంపించారు. ఈ క్రమంలో జులై 25న ఆర్డీవో సదరు దస్త్రాన్ని కలెక్టరేట్​కు పంపించారు. ఈ క్రమంలో మెదక్​ అడిషనల్ ​కలెక్టర్​ నగేష్​ సదరు భూమికి నిరభ్యంతర పత్రం జారీ చేసేందుకు ఎకరాకు లక్ష రూపాయల చొప్పున తనకు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఇందుకు ఒప్పుకున్న లింగమూర్తి జులై 31న మొదటి విడతగా రూ.19.5 లక్షలు, రెండో విడతగా ఆగస్టు 7న మరో రూ.20.5 లక్షలు కలిపి మొత్తం రూ.40 లక్షలు నగేష్​కు ఇచ్చాడు. ఇవిపోనూ ఒప్పందంలో భాగంగా ఇవ్వాల్సిన మిగతా రూ.72 లక్షలు లింగమూర్తి చెప్పిన సమయంలోగా అందజేయలేకపోయారు. కాగా, అదనపు​ కలెక్టర్​ నగేష్​రూ.72 లక్షలకు బదులుగా ఐదెకరాల భూమిని తన బినామీ అయిన కోల జీవన్​గౌడ్​కు విక్రయించేలా లింగమూర్తితో ఒప్పందపత్రం రాయించుకున్నారు. ఆ ఐదెకరాల భూమి రిజిస్ట్రేషన్​చేసేందుకు జమానతుగా లింగమూర్తి నుంచి నగేష్​ సంతకం చేసిన 8 ఖాళీ చెక్కులను తీసుకున్నారు.

బినామీతో దందా
ఇదిలాఉండగా, భూసర్వే కార్యాలయంలో జూనియర్​అసిస్టెంట్​గా పనిచేసే మహ్మద్​వసీం లింగమూర్తి నుంచి రూ.ఐదులక్షలు తీసుకుని అందులో నుంచి నర్సాపూర్​ఆర్డీవో అరుణారెడ్డికి రూ.ఒక లక్ష, తహసీల్దార్​అబ్దుల్​సత్తార్ కు రూ.లక్ష ఇచ్చి మిగిలిన రూ.మూడు లక్షలు తాను తీసుకున్నాడు. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చి నిరభ్యంతర పత్రం తీసుకుని, భూమి రిజిస్ట్రేషన్ ​చేసుకోవాలని అడిషనల్​ కలెక్టర్ ​నగేష్​బాధితుడు లింగమూర్తిపై పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో విసిగిపోయిన లింగమూర్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లింగమూర్తి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ లు సూర్యనారాయణ, ఫయజ్, ఆరుగురు సీఐల ఆద్వర్యంలో మెదక్ మండలం మాచవరంలోని అడిషనల్​ కలెక్టర్ ​నగేష్​ ఇంట్లో సోదాలు జరపడంతో పాటు నర్సాపూర్​లోని ఆర్డీవో ఆఫీసు, తహసీల్దార్ ​కార్యాలయం, సంగారెడ్డిలోని తహసీల్దార్​ సత్తార్​ఇంట్లో , హైదరాబాద్ లోని ఆయా అధికారుల ఇళ్లు, వారి బంధువుల ఇళ్లలో కలిపి మొత్తం 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఉదయం 7:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆయా చోట్ల సోదాలు కొనసాగాయి.
సోదాల్లో నగేష్ ​ఇంట్లో చిప్పల్​తుర్తి భూమికి సంబంధించి లింగమూర్తితో జరిగిన ఒప్పందంలో భాగంగా ఆయన ఇంట్లో నుంచి తన బినామీ అయిన జీవన్​గౌడ్​ పేరు మీద చేసుకున్న ఐదెకరాల భూమి విక్రయ ఒప్పంద పత్రం, 8 ఖాళీ చెక్​ లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలాఉండగా, హైదరాబాద్​లోని నర్సాపూర్​ ఆర్డీవో అరుణారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో సరైన అధారాలు లేని రూ.28లక్షల నగదుతో పాటు అర కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.