పదవికి గుడ్ చెప్పనున్న ఈసీబీ చైర్మన్
లండన్: ‘హండ్రెడ్ బాల్’ టోర్నీ వాయిదా పడడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 31వ తేదీ తర్వాత ఈ పోస్ట్ కు గుడ్ బై చెప్పనున్నాడని ఈసీబీ ప్రకటించింది.
మే 2015లో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గ్రేవ్స్ ఐసీసీలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ బాడీ చైర్మన్ శశాంక్ మనోహర్ వారసుడిగా ఇప్పటికే అతని పేరు తెరపైకి వచ్చింది.
ఈసీబీ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న హండ్రెడ్ టోర్నీని ఘనంగా ప్రారంభించేందుకు గ్రేవ్స్ నవంబర్ వరకు పదవిలో కొనసాగాలని అనుకున్నాడు. కానీ ఈ టోర్నీ వచ్చే ఏడాదికి వాయిదాపడడం, కరోనాతో క్రికెట్ స్థంభించడంతో పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాడు.
గ్రేవ్స్ స్థానంలో ఇక ఈసీబీ చైర్మన్గా ఇయాన్ వాట్ మోర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ‘అనుకోకుండా హండ్రెడ్ బాల్ టోర్నీని వాయిదావేయాల్సి వచ్చింది. గతేడాదే నేను పొడిగింపు తీసుకున్నా. కాబట్టి వీలైనంత త్వరగా ఈ పదవి నుంచి దిగిపోవాలనుకుంటున్నా. బోర్డుకు కూడా విజ్ఞప్తి చేశా.
జులై చివర్లో నా ఫేర్ వేల్ కు సంబంధించిన పనులు మొదలుపెడతా. అప్పటి వరకు చాలా పనులు చేయాల్సి ఉంది. కరోనా కష్టకాలంలో ఈసీబీని గట్టెక్కించాల్సిన బాధ్యత నాపై ఉంది’ అని గ్రేవ్స్ పేర్కొన్నాడు.