న్యూఢిల్లీ: టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరును ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు బీసీసీఐ ప్రతిపాదించింది. ఓపెనర్ శిఖర్ ధవన్, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ పేర్లను అర్జున పురస్కారాలకు సిఫారసు చేసింది. మహిళల విభాగంలో ఆల్ రౌండర్ దీప్తిశర్మ అర్జునకు నామినేట్ అయింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ ఐదుసెంచరీలు చేయడంతో బీసీసీఐ ఏకగ్రీవంగా అతని పేరును సిఫారసు చేసింది. ఇక 2018లో స్మృతి మంధనతో పాటు ధవన్ పేరును అర్జునకు ప్రతిపాదించినా అవార్డు దక్కలేదు. దీంతో మరోసారి నామినేట్ చేశారు. అరంగేట్రంలోనే అత్యంత వేగంగా టెస్ట్ సెంచరీ చేసిన రికార్డు శిఖర్ ధవన్ సొంతం.
చాంపియన్స్ ట్రోఫీలో రెండుసార్లు వరుసగా గోల్డెన్ బ్యాట్ పురస్కారం సాధించిన ఏకైక ప్లేయర్ శిఖర్. టీమిండియా తరఫున అత్యంత చిన్నవయసులో మూడు ఫార్మాట్లు ఆడిన తొలి క్రికెటర్ ఇషాంత్. ఆసియా వెలుపలా అత్యధిక వికెట్లు కూడా పడగొట్టాడు. మూడేళ్లుగా వన్డే, టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్న దీప్తి.. మహిళల క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన రెండో ఇండియన్ క్రికెటర్‌గానూ రికార్డులకెక్కింది. గణాంకాలు, సాధించిన ఘనతలను పరిగణనలోకి తీసుకునే అవార్డులకు సిఫారసు చేశామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. మరోవైపు జావెలిన్ త్రోలో అద్భుతంగా రాణిస్తున్న స్టార్ త్రోయర్ నీరజ్ చోప్రా పేరును ఖేల్‌రత్నకు భారత అథ్లెటిక్స్ సమాఖ్య సిఫారసు చేసింది. స్ప్రింటర్ ద్యుతీచంద్‌ను అర్జునకు నామినేట్ చేశారు.