న్యూఢిల్లీ: ఫిట్‌నెస్ విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చూసి సిగ్గుపడ్డామని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ తమీమ్ ఇక్బాల్ అన్నాడు. భారత క్రికెట్లో వస్తున్న మార్పులను తాము అనుసరిస్తామన్నాడు. ఫిట్ నెస్ విషయంలో కోహ్లీసేన తమ దృక్పథాన్ని మార్చేసిందన్నాడు. ‘పొరుగు దేశమైన భారత్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి మాకూ ఉంటుంది. ప్రారంభంలో ఫిట్‌నెస్‌పై మాకు పెద్దగా అవగాహన లేదు. కానీ భారత్‌ను చూశాకా మా దృక్పథం మొత్తం మారిపోయింది. ఇప్పుడు మేం కూడా ఫిట్‌నెస్ విషయంలో చాలా మెరుగవుతున్నాం’ అని తమీమ్ పేర్కొన్నాడు.
తన వయసులోనే ఉన్న కోహ్లీ ఫిట్‌నెస్ చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. ‘ఇది చెప్పేందుకు నేను సిగ్గుపడను. రెండు, మూడేళ్ల క్రితం జిమ్‌లో విరాట్ చేసే కసరత్తులు చూసి సిగ్గుపడేవాడిని. ఇంత సక్సెస్ సాధించాకా కూడా అతను ఫిట్‌నెస్ కోసం ఎంతో శ్రమిస్తున్నాడు. నేను అతనిలో సగం కూడా అందుకోలేదు. ఆ స్థాయిలో నేను కష్టపడకపోయినా.. ఆ దారిలో నడిచినా చాలు. 50, 60 శాతం చేరుకుంటా’ అని తమీమ్ వ్యాఖ్యానించాడు.