ముంబై: క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉంటున్న నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మతో కలిసి పంచుకోవాలని భారత మాజీవికెట్ కీపర్ కిరణ్ మోరె అన్నాడు. ఏడాది మొత్తం ఒకరే నాయకుడిగా వ్యవహరించడంతో బరువు పెరుగుతుందన్నాడు. ఒక జట్టు.. ఇద్దరు సారథుల అంశంపై మోరె మాట్లాడుతూ.. ‘బీసీసీఐ ఈ అంశంపై దృష్టిపెట్టాలి. టీమిండియా అన్ని ఫార్మాట్లతో కలిపి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా కోహ్లీయే కెప్టెన్‌గా ఉన్నాడు. తద్వారా ఒత్తిడి, బాధ్యతలు పెరిగిపోతున్నాయి. ఇది కొనసాగడం వల్ల కొన్ని రోజులకు ఆట తీరు దెబ్బతినవచ్చు. సరైన విశ్రాంతి కూడా లభించదు. రోహిత్ కూడా కెప్టెన్‌గా బాగానే పనిచేస్తున్నాడు. అతను ఉండడంతో విరాట్‌కు లాభమే.. ఇద్దరు కలిసి టీమ్‌ను మరింత ముందుకు నడిపించొచ్చు’ అని మోరె అభిప్రాయపడ్డాడు.
కోహ్లీ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచే సచిన్ రికార్డులను బద్దలు కొడతాడని తాను అప్పట్లోనే ఊహించానన్నాడు. ఇప్పుడున్న క్రికెట్లో కోహ్లీ ఓ సూపర్ స్టార్.. అతనికి తిరుగులేదన్నాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో పనిచేస్తున్న విరాట్‌కు విశ్రాంతి ఇచ్చినప్పుడే రోహిత్ టీమిండియా బాధ్యతలు చేపడుతున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్, నిదహాస్ టోర్నీ, ఆసియా కప్‌లో జట్టును విజయవంతంగా నడిపించాడని అన్నాడు.