Breaking News

కరోనా మరింత తీవ్రరూపం

కరోనా మరింత తీవ్రరూపం

జెనీవా: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ముప్పు ఇప్పట్లో తొలగేలా లేదని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ టెండ్రోస్‌ అధనామ్‌ గెబ్రియేసన్‌ స్పష్టం చేశారు. వైరస్‌ గురించి డబ్ల్యూహెచ్‌వోకు చైనా ఇన్ఫర్మేషన్‌ ఇచ్చి ఆరు నెలలు అయిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైరస్‌ వ్యాప్తి చెందేందుకు వాతావరణం అనువుగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా మరింత మంది ఈ వైరస్‌ బారినపడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వైరస్‌ ముగిసిపోవాలని, మన సాధారణ జీవితాలు కొనసాగించాలని అనుకుంటున్నాం. కొన్ని దేశాలు వైరస్‌ను సమగ్రంగా ఎదుర్కోగలుగుతున్నాయి. కానీ వాస్తవం ఏంటంటే ఈ ముప్పు ఇప్పట్లో ముగిసేలా లేదు అని అధనామ్‌ అన్నారు. ఈ సమయంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యూహంతో పోరాడాలని దేశాలకు ఆయన సూచించారు.

వ్యాక్సిన్‌ కనిపేట్టేందుకు కృషి చేస్తున్నారని, అయినప్పటికీ అది కూడా సక్సెస్‌ అవుతుందనే గ్యారెంటీ లేదని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ వింగ్‌ చీఫ్‌ మైక్‌ రేయాన్‌ అభిప్రాయపడ్డారు. వైరస్‌ బారిన పడినవారి కాంటాక్ట్స్‌ను గుర్తించి, ఐసోలేషన్‌లో ఉంచడం, టెస్టులు చేయడం వల్ల వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు. జపాన్‌, సౌత్‌ కొరియా, జర్మనీ దేశాలు ఈ విధంగానే చేశాయని ఆయన చెప్పారు. కరోనా వ్యాప్తి మొదలై ఆరు నెలలు గడవగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి మందికి సోకగా.. ఐదులక్షల మందిని పొట్టనపెట్టుకుంది.