న్యూఢిల్లీ: ఐపీఎల్ భవిష్యత్ పై సందేహాలు వెంటాడుతూనే ఉన్న నేపథ్యంలో కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఐపీఎల్ జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీసీసీఐ సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశాల్లేవని స్పష్టం చేశారు. ‘కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చిన తర్వాతే ఐపీఎల్ పై నిర్ణయం ఉంటుంది.
వైరస్ వ్యాప్తి ఆధారంగానే ఈ నిర్ణయం ఉంటుంది. టోర్నీలు నిర్వహించాలనే ఏకైక కారణంతో ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టలేం. ప్రస్తుతం మా దృష్టంతా కరోనా కట్టడిపైనే ఉంది. కాబట్టి ఈ సమయంలో వేరే వాటి గురించి ఆలోచించే అవకాశం లేదు’ అని రిజిజు పేర్కొన్నారు. ఒకవేళ ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ లో జరిగే టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. ఆ విండోలో ఐపీఎల్‌ను నిర్వహించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది.