Breaking News

ఐపీఎల్​కు లైన్​ క్లియర్​

ఐపీఎల్​కు లైన్​ క్లియర్​
  • ఆస్ట్రేలియా మాజీకెప్టెన్ మార్క్ టేలర్

మెల్‌ బోర్న్‌: కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్ర్టేలియాలో టీ20 ప్రపంచకప్ జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈనెల 28న ఐసీసీ సమావేశంలో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ టీ20 ప్రపంచకప్ వాయిదాపడితే.. ఐపీఎల్​ కు మార్గం సుగమమైనట్లేనని ఆస్ర్టేలియా మాజీకెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. ఆ సమయంలో అన్ని దేశాలు ఖాళీగా ఉంటాయి కాబట్టి లీగ్​ను నిర్వహించేందుకు ఈజీగా ఉంటుందన్నాడు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్ జరగకపోవచ్చు. కానీ షెడ్యూల్ టైమ్ వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఇప్పుడే చెప్పలేం.

అయితే 15 జట్లను ఆసీస్​ కు తీసుకొచ్చి, ఏడు వేదికల్లో మ్యాచ్​లు నిర్వహించడం, క్వారంటైన్​ లో ఉంచడం చాలా కష్టంతో కూడుకున్నది. కాబట్టి ఈ లెక్కన మెగా ఈవెంట్ దాదాపుగా అసాధ్యమేనని అనిపిస్తోంది’ అని టేలర్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్​లో ఆడాలనుకునే క్రికెటర్లు వ్యక్తిగతంగా అన్ని బాధ్యతలు తీసుకోవాలన్నాడు. వీళ్ల ప్రయాణ బాధ్యతలను జాతీయ బోర్డులు తీసుకోవద్దని చెప్పాడు. జట్టు మొత్తం కాకుండా ప్లేయర్లు ఒక్కొక్కరుగా వెళ్లడం మంచిదని టేలర్ చెప్పుకొచ్చాడు.