మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
సారథి న్యూస్, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని కూర్చొని పూర్తి చేయిస్తానని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తికాలేదని, సీఎం కేసీఆర్ ది నోరా మోరా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బుధవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న ముంపు గ్రామాల్లో కాంగ్రెస్ నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా నీళ్లు, నిధులు, నియామకాలకు అలుపెరుగని ఉద్యమాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టు తర్వాతే ప్రారంభించిన రంగనాయక సాగర్ ఎలా పూర్తయిందని ప్రశ్నించారు. వీటిని పూర్తిచేసి నీళ్లిస్తే పాలాభిషేకం చేసేవాళ్లమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, డీసీసీ అధికార ప్రతినిధి లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, అక్కన్నపేట మండలాధ్యక్షుడు ఐలయ్య, హుస్నాబాద్ పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్, చిగురుమామిడి మండలాధ్యక్షుడు మల్లేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిష్టయ్య ఉన్నారు.