న్యూఢిల్లీ: ఆధునిక క్రికెట్ యుగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను మించిన వాళ్లు లేరని లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అన్నాడు. భారత క్రికెట్ జట్టు విజయాలలో ఈ ఇద్దరి పాత్ర వెలకట్టలేనిదన్నాడు. అందుకే సమకాలిన క్రికెట్ లో ఈ తరం వాళ్లదేనని స్పష్టం చేశాడు. ‘మేం ఆడే రోజుల్లో ద్రవిడ్, దాదా అద్భుతంగా ఆడేవాళ్లు. కేవలం క్రికెటింగ్ షాట్లతోనే పరుగులు సాధించేవారు.
సాంకేతికంగా కూడా ఈ ఇద్దరు చాలా బలమైన ప్లేయర్లు. ఈ విషయంలో ద్రవిడ్ ఓ అడుగు ముందున్నా.. అవసరమైనప్పుడు గంగూలీ కూడా మంచి షాట్లు ఆడేవాడు. ఇప్పుడు విరాట్, రోహిత్ కూడా అంతే. ఈ ఇద్దరూ సంప్రదాయమైన షాట్లే ఆడతారు. ఒక్క చెత్త షాట్ కూడా ఉండదు. మారుతున్న నిబంధనల వల్ల వన్డేల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఇందులో వాస్తవం ఉన్నా.. విరాట్, రోహిత్ పరుగులు చేసే విధానం చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. షాట్స్ కొట్టేందుకు కండబలం కాకుండా బుద్ధి బలాన్ని ఉపయోగిస్తారు. అందుకే ఈ ఇద్దరు ఈ తరాన్ని ఏలేస్తున్నారు’ అని సంగక్కర వివరించాడు.