Breaking News

ఇంట్లోనే మెడికల్​ గ్యాడ్జెట్స్ ​

ఒకప్పుడు జలుబు, దగ్గు, బీపీ, షుగర్​ లాంటివి ఉన్నా పెద్దగా ఆందోళన చెందేవాళ్లు కాదు. కానీ ఈ కరోనా కాలంలో ఏ చిన్న ఆరోగ్య సమస్యనూ నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు డాక్టర్లు. అలాగని ప్రతి సమస్యకూ ఆస్పత్రికి వెళ్లడం కూడా మంచిది కాదు. అందుకే ఇంట్లో కొన్ని గ్యాడ్జెట్స్ ఉంటే.. అవి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉపయోగపడతాయి. మరి ఎలాంటి మెడికల్ గ్యాడ్జెట్స్ ఇంట్లో ఉండాలో తెలుసుకుందాం.
కరోనా వైరస్ సంక్షోభంతో ప్రతి ఒక్కరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏయే రకాల ఎక్సర్‌సైజ్‌లు చేయాలన్న విషయాలపై బాగా దృష్టిసారిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీపీ, షుగర్​ ఉన్నవారైతే రెగ్యులర్​గా పరీక్షలు చేయించుకుంటారు. కానీ వైరస్​ వ్యాప్తి పెరుగుతున్న టైమ్​లో మాటిమాటికీ హాస్పిటల్స్​ చుట్టూ తిరగడం కూడా కరెక్ట్​ కాదు. ఇంట్లో మెడికల్​ గ్యాడ్జెట్స్​ తెచ్చిపెట్టుకుని టెస్ట్​ చేసుకోవడం మంచిది.


వెయింగ్​ మెషిన్​
ఉన్నట్టుండి బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతోందా? ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇలా జరగొచ్చు. అందుకే తరచూ బరువు చెక్​ చేసుకుంటూ ఉండాలి. ఇదొక్కటనే కాదు, రెగ్యులర్​గా ఎక్సర్​సైజ్​ చేస్తున్నా వెయిట్​ చూసుకోవడం మంచిది. దీనికోసం ఈ కరోనా టైమ్​లో బయటికి వెళ్లడం కరెక్ట్​ కాదు. అందువల్ల ఇంట్లోనే ఒక వెయింగ్​ మెషిన్​ ఉంటే మంచిది. ఇప్పుడు మార్కెట్​ లేదా ఆన్​లైన్​లో ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయల మధ్య అనేక రకాల వెయింగ్​ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని తెచ్చుకుని ఎప్పటికప్పుడు బరువు చెక్​ చేసుకోవచ్చు. పిల్లలు ఉన్న ఇళ్లలో ఇది కచ్చితంగా ఉండాల్సిన గ్యాడ్జెట్​.


థర్మోమీటర్​
కరోనా లక్షణాల్లో ముఖ్యమైనది జ్వరం. అందువల్లే చాలామంది కొంచెం జ్వరంగా అనిపించినా హడలిపోతున్నారు. అదే థర్మోమీటర్​ ఉంటే, శరీరం వేడిగా అనిపించిన ప్రతిసారీ టెంపరేచర్​ చెక్​ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో డిజిటల్​ థర్మోమీటర్లు ఈజీగా దొరుకుతున్నాయి. వాటి ధర కూడా తక్కువగానే అంటే వందల్లోనే ఉంటోంది. అలాగే కాంటాక్ట్​లెస్​ థర్మోమీటర్లు రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల మధ్యలో ఉంటోంది. ఇలా ఇంట్లోనే టెంపరేచర్​ చెక్​ చేసుకుంటే, ఏ దిగులు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు.
బ్లడ్​ ప్రెషర్​ మానిటర్​
హైపర్ టెన్షన్(హై బీపీ) లాంటి సమస్యలతో బాధపడేవారు ఇంట్లో ఒక్కరున్నా సరే, ప్రెషర్ మానిటర్ తప్పనిసరిగా ఉండాలి. ఎప్పటికప్పడు బీపీ చెక్ చేసుకుని నోట్ చేయాలి. వాటి వివరాలు ఫ్యామిలీ డాక్టర్‌కు ఫోన్లో చెప్పి సలహాలు తీసుకోవచ్చు. తీసుకునే ట్యాబ్లెట్లలో ఏమైనా మార్పులుంటే అప్పుడు మార్చుకోవచ్చు. ఈ బీపీ మానిటరింగ్​ మెషిన్​ మార్కెట్లో ఐదు వందల నుంచి మూడువేల రూపాయల మధ్యలో దొరుకుతున్నాయి.
గ్లూకోమీటర్​
ఈ రోజుల్లో డయాబెటిస్​ చాలా మామూలైపోయింది. వయసు తేడాలేమీ లేకుండా అందరికి షుగర్​ ప్లాబ్లమ్​ వచ్చేస్తోంది. అందుకే బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవడానికి ఇంట్లో గ్లూకోమీటర్ ఉండడం మంచిది. తినడానికి ముందు, తిన్న తర్వాత బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవచ్చు. గ్లూకోమీటర్ ధర మార్కెట్​ లేదా ఆన్​లైన్​లో రూ.500 నుంచి రూ.రెండువేల మధ్యలోనే ఉంటోంది.
పల్స్​ ఆక్సీమీటర్​
ఎప్పటికప్పుడు పల్స్​ రేట్​ తెలుసుకోవాలంటే ఈ పల్స్​ ఆక్సీమీటర్​ బాగా పనిచేస్తుంది. కరోనా కారణంగా ఇప్పుడు ఈ పల్స్​ ఆక్సీమీటర్​కు మార్కెట్లో డియాండ్​ బాగా పెరిగింది. దీని ధర రూ.రెండు వేల నుంచి రూ.ఐదువేల మధ్యలో ఉంటుంది. ఇది ఇంట్లో పల్స్​ రేట్​ చెక్​ చేసుకుంటూ నిశ్చింతగా ఉండొచ్చు.
నెబ్యులైజర్​
ఇంట్లో పిల్లలు ఉన్నా, ఆస్తమా పేషెంట్లు ఉన్నా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవాళ్లు ఉన్నా నెబ్యులైజర్ తప్పనిసరిగా ఉండడం మంచిది. ప్రతిసారి క్లినిక్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే నెబ్యులైజ్​ చేసుకోవచ్చు. దీని ధర రూ.1500 నుంచి రూ.3వేల వరకు ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం మొదలైంది కాబట్టి ఇంట్లో ఎవరికి జలుబు చేసి, శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉన్నా ఇది ఉపయోగపడుతుంది.