న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ లో ఎన్నో ఘనతలు సాధించిన తాను.. అర్జున అవార్డుకు ఎందుకు సరిపోనని స్టార్ షట్లర్ హెచ్ఎస్. ప్రణయ్ అన్నాడు. తనకంటే తక్కువ స్థాయి ప్లేయర్లను అవార్డుకు సిఫారసు చేసి, తనను పక్కనబెట్టడం వెనుక కారణమేంటని ప్రశ్నించాడు. ‘ప్రతి ఏడాది జరిగే కథే మళ్లీ పునరావృతమైంది. కామన్వెల్త్, ఆసియా గేమ్స్ లో పతకాలు సాధించిన నాకు అవార్డు తీసుకునే అర్హత లేదా? అసోసియేషన్ కనీసం సిఫారసు కూడా చేయదా? కెరీర్లో మేజర్ టోర్నీలు ఆడని ప్లేయర్లను అవార్డులకు ఎలా ప్రతిపాదిస్తారు? ఇందుకు ఏదైనా ప్రతిపాదిక ఉందా’ అని తీవ్ర స్థాయిలో ప్రణయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అర్జున రేసులో నిలిచిన ముగ్గురిలో సాత్విక్, చిరాగ్ కామన్వెల్త్ లో రజత పతకాలు నెగ్గారు. కానీ సమీర్ వర్మ ఈ మెగా ఈవెంట్‌లో పోటీపడలేదు. ఇక ప్రణయ్.. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గడంతో పాటు 2018 మేలో వరల్డ్ నం.8 ర్యాంక్ సాధించాడు. 2017 ఇండోనేసియా ఓపెన్‌లో వరుస మ్యాచ్‌ల్లో మాజీ వరల్డ్ నంబర్ వన్ లీ చోంగ్ వీ, ఒలింపిక్ చాంప్ చెన్‌లాంగ్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు.