సారథి న్యూస్, రంగారెడ్డి : ప్రేమ పేరుతో మోసపోయిన బాధితురాలు అరుణకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని కమిషన్ సభ్యుడు చిలకమర్రి నరసింహ హామీనిచ్చారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్ఘాట్ గ్రామానికి చెందిన దళిత కులానికి చెందిన అరుణ, అదే గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ ప్రేమించి పెళ్లి చేసుకుని మోసగించాడు. అరుణ న్యాయ పోరాటానికి దిగింది. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు నరసింహ స్పందించి తుర్కయాంజాల్ రెవెన్యూ డివిజన్ ఆర్టీవో అమరేందర్, ఇబ్రహీంపట్నం డివిజన్ ఏసీపీ యాదగిరి రెడ్డి, మంచాల మండలం తహసీల్దార్ తో కలిసి గురువారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యుడు నరసింహా మాట్లాడుతూ అరుణను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత భర్త దూసరి వెంకటేష్ గౌడ్ మోసం చేసి వెళ్లిపోయిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. 24 గంటల్లో వారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించాలని సూచించారు. ప్రభుత్వం బాధితురాలికి మౌలిక సదుపాయాల నిమిత్తం తక్షణమే రూ. 25వేల నగదు ఇస్తుందన్నారు. అరుణకు ప్రభుత్వ పరంగా రావాల్సిన 20 శాతం ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు చెప్పారు.
బాధితురాలికి న్యాయం చేయాలి : మాజీ ఎమ్మెల్యే నరసింహ
కులాంతర వివాహం పేరుతో మోసపోయిన బాధితురాలు కందుకూరి అరుణను ప్రభుత్వం ఆదుకోవాలని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నరసింహా డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితురాలు అరుణను కలిసి పరామర్శించారు.