Breaking News

అన్ని ఆవాసాలకు భగీరథ నీరు

అన్ని ఆవాసాలకు భగీరథ నీరు

సారథి న్యూస్, మెదక్: జిల్లాలోని అన్ని ఆవాసిత ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్ రావు ప్రకటించారు. పెండింగ్​ పనులను కంప్లీట్​చేసి సింగూర్ ద్వారా మంచినీటిని అందిస్తామని, అలాగే కోమటిబండ ద్వారా శివ్వంపేటలో నిర్మిస్తున్న సంపును పూర్తిచేసి గోదావరి జలాలను అందిస్తామని మంత్రి వెల్లడించారు. శుక్రవారం నర్సాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి తాగునీటి సరఫరా, నీటిపారుదల, పంచాయతీ రాజ్, ఆర్టీసీ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ముందుగా తాగునీటి సరఫరాపై సమీక్షిస్తూ నర్సాపూర్ ​హైవే పనులతో పైపులు డ్యామేజీ, లీకేజీ వంటివి చోటుచేసుకుంటున్నాయని, పనులు చేపట్టకపోతే నీళ్లు ఇవ్వలేమన్నారు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ.54 కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీరోడ్లు వంటి వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. నర్సాపూర్​ డిపో పనులు ఫిబ్రవరి 15వ తేదీలోగా పూర్తిచేయాలని సూచించారు. నీటి పారుదల రంగాన్ని సమీక్షిస్తూ మంజీరాపై 11 చెక్ డ్యామ్​లు, హల్దీ వాగుపై మూడు చెక్ డ్యామ్​లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ యాసంగికి ఘనపూర్ ఆయకట్టు కింద 21,625 ఎకరాల పూర్తి ఆయకట్టుకు సాగు నీరందిస్తామన్నారు. అలాగే సింగూర్ కింద 40వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సమావేశంలో నర్సాపూర్ ఇన్​చార్జ్​ ఆర్డీవో సాయిరాం, నీటి పారుదలశాఖ ఈఈ ఏసయ్య, పంచాయతీరాజ్ శాఖ ఈఈ రామచంద్రారెడ్డి, ఆర్​డబ్ల్యూ ఎస్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.