Breaking News

సామాజిక విప్లవం.. వీరబ్రహ్మం తత్వం

తెలుగు రాష్ట్రాల్లో ఏ విచిత్ర సంఘటన జరిగినా ఒక్కసారి అంతా ఓ 400 ఏళ్ల పైచిలుకు కాలానికి వెళ్లి అది అప్పుడే బ్రహ్మంగారు చెప్పారంటూ కథలుగా, వింతలుగా చెప్పుకోవడం సర్వసాధారణం. ఇక ఆయన పేరిట పల్లెపట్టణాలు, తెలుగు లోగిళ్లలోనూ అనేక తత్వాలు ప్రాచుర్యంలో ఉండీ ముఖ్యంగా సన్యాసం తీసుకున్న వారు పాడుతుండడం ఏళ్లతరబడి సాగుతున్న సంప్రదాయమే. అసలు విషయానికి వస్తే పోతులూరు వీరబ్రహ్మేంద్రుల వారిని ఒక మత సిద్ధాంతవేత్తగానో, ఆధ్యాత్మికవాదిగానో చూసే కంటే ఆయన జీవితంలోని ఆటుపోట్లు మొదలుకుని, అనేక అనుభవాల కోణాలను మనం స్పృశిస్తే ఆయనో సామాజిక విప్లవకారుడని చెప్పక తప్పదు. ఓ భవిష్యద్రష్టగా ఆయన అనేక అంశాలను ఊహించి కాలజ్ఞాన రూపంలో చెప్పినప్పటికీ ఆ తత్వాల్లో సామాజిక కోణం ఇమిడి ఉంది. ప్రధానంగా ఆయన ఉన్న కాలాన్ని మనం పరిశీలిస్తే..బ్రహ్మేంద్రస్వామి కోసం మనకు దొరికిన ఆధారాల ప్రకారం, ఆయనే చెప్పారని ప్రాచుర్యలో ఉన్న కాలజ్ఞానం ప్రతుల ప్రకారం కానీ ఆయన 1608 కాలంలో పుట్టినట్లు ఓ 70 నుంచి 80ఏళ్లకు పైగా బాహ్యప్రపంచంలో ఉండి సజీవ సమాధి పొందారని కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ప్రచురణలు ఇతరత్రాను తెలుస్తోంది. ఆ కాలంలో ఆయన సామాజికవర్గాల పరంగా చాలా సమస్యలు గుర్తించి వాటికి తనవంతుగా పరిష్కారం చేసే ప్రయత్నం చేశారనడానికి కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు.
స్వతంత్ర జీవనం.. అసలు తత్వం
బ్రహ్మేంద్ర స్వామి బాల్యజీవితం కర్నూలు జిల్లా బనగాన పల్లె గ్రామంలో భూస్వామి గరిమిరెడ్డి అచ్చెమ్మ ఇంట పశువుల కాపరిగా ప్రారంభమవుతుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన తన జీవితంలో నిలదొక్కుకునేందుకు అప్పటి పరిస్థితుల రీత్యా గోపాలకుడిగా జీవితం ప్రారంభించి ఉండొచ్చు. ఆ సమయంలోనే ఆయన అక్కడికి సమీపంలో ఉండే రవ్వలకొండ గుహలో కాలజ్ఞానం రాశారని కథనాలు ఉన్నాయి. వీటికి మహిమలు వంటివి ఆపాదించినా ఆయన సమాజ భవిష్యత్​ కోసం ఎక్కువగా ఆలోచించారని అంచనా వేయొచ్చు. ఇందుకు అప్పుడున్న భక్తిమార్గం, యోగ సిద్ధాంతాలను ఒంట పట్టించుకుని తద్వారా పరిష్కార మార్గాలు కనుగొనే ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇందుకు ఆయన పాపభీతి పెంచడం ద్వారా సమాజ రుగ్మతలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఆలోచన చేశారనిపిస్తోంది. అందుకే ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఎక్కువగా ఉత్పాతాలు సంభవిస్తాయని, దేవుడి గుళ్లలో విచిత్రాలు సంభవించి ఉపద్రవాలు వస్తాయని, జననష్టం సంభవిస్తుందనీ చెప్పాడు. ఇందుకు తన చుట్టూ ఉన్న పట్టణాలు అంటే ఆదోని, లేపాక్షి, తిరుమల, ఇటు బెజవాడ, కన్నడ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ఎంచుకున్నాడు. ప్రజల్లో ఉన్న ఆధ్యాత్మిక చింతన ద్వారానే వారికి చేరువయ్యి తన వాదాన్ని వినిపించి మార్పుకోసం యత్నించాడనపిస్తోంది. ఇందుకు వీరబ్రహ్మం ఎంచుకున్న భాష ఎంతో ఉపకరించింది. ప్రజాజీవనంలోనూ.. నానుడిలోనూ ఉన్న పదాలనే వినియోగించి తత్వాలను ‘గోవింద’ మకుటం, అలాగే అనంతరం కాలంలో ‘వీరకాళికాంబ ’ మకుటంతో రచనలు చేసి ప్రజలను ఆలోచింపచేశారు. తనకు లభించిన సునిశిత పరిశీలనా ధోరణితో కొంత ‘పారా సైకాలజీ’ వినియోగించి కొన్ని అంశాలు చెప్పడం.. వాటి ఆధారంగా జరగబోయేవి బేరీజు వేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు. అయితే వీటన్నింటిలోనూ ఆయన సమాజంలో వస్తున్న నైతిక మార్పులు, పెడధోరణులు గుర్తించి ఓ హెచ్చరిక లాంటిది చేసి పరిధులు దాటొద్దని ఆంక్షల రేఖలను గీసినట్లు అర్థమవుతోంది.
స్వాభిమానానికి ప్రతీక
బ్రహ్మంగారు నివాస గృహం ఒకప్పటి కందిమల్లయ్య పల్లెలో ఏర్పాటు చేసుకున్నారు. నేడు బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి పొందిన ఊరులో ఆ ఇల్లు ఇప్పటికీ భద్రంగా ఉంది. కడప జిల్లాలో ఉన్న ఆ ఇంటిని సందర్శిస్తే మనకు ఆకట్టుకునేది ..ఆలోచింప జేసేది అక్కడ చెప్పే బావి కథ. విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వీరబ్రహ్మానికి ఆ గ్రామస్థులు ఊరి అమ్మవారి ఉత్సవాలకు గాను ఓ చెక్కరథాన్ని సిద్ధం చేయమన్నారట.. అయితే ఆయన సకాలంలో దాన్ని అందివ్వకపోవడంతో గ్రామంలోని వారంతా వినియోగించే మంచినీటి బావినుంచి ఆ కుటుంబీకులు నీరు తోడుకోకుండా నిషేధం విధిస్తారు. దీన్ని పట్టించుకోని బ్రహ్మం కుటుంబీకులు రెండో రోజు తమ ఇంటి ద్వారాన్నే తెరువరు. కొన్నిగంటల పాటు వేచి చూసిన స్థానిక పెద్దలు ఉండబట్టలేక వారే బ్రహ్మంగారి ఇంటికి వెళ్లి బావి వద్దకు రాకుండా నీటి అవసరాలు ఎలా తీర్చుకున్నారని ఆరా తీస్తే వారింటి ఆవరణలోనే తవ్వుకున్న బావిని చూపించడంతో వారు ఆశ్చర్యపోయి దాన్ని మహిమగా చెబుతారు. మరో కోణంలో చూస్తే మనకున్న ఆధారాల ప్రకారం బ్రహ్మంగారి కుటుంబసభ్యులు సుమారు 13మంది. నీటి వనరులు పుష్కలంగా ఉన్న ఆరోజుల్లో వారంతా శ్రమిస్తే ఓ రాత్రికి రాత్రే మూడు అడుగుల బావి తవ్వడం కష్టం కాదు. బహుశా ఆయన తన స్వతంత్ర, ఒకరిపై ఆధారపడకూడని తత్వాన్ని ఆ విధంగా చాటి ఉండొచ్చు. ఇదే సందర్భంలో ఆయన ఆ ఊరు పోలేరమ్మ ఉత్సవాల్లో జరిగే జంతుబలిపై కూడా గ్రామస్థులకు అవగాహన కలిగించి దాన్ని ఆపించడం ఓ విప్లవాత్మక చర్యగానే చెప్పుకోవాలి. దీనికీ ఓ మహిమ ఆపాదిస్తూ ఓ కథ ప్రాచుర్యంలో ఉన్నా..తనకున్న చాతుర్యంతో వారిని ఒప్పించి ఉండొచ్చు. వారి ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి ఏదో పద్ధతిని వినియోగించి మొత్తానికి తాను అనుకున్న బాటలో గ్రామాన్ని నడిపించి ఉండొచ్చు.
సంస్కరణ భావాలకు దర్పణం
వీరబ్రహేంద్ర స్వామి.. కాలంలోని సామాజిక రీతులను చూస్తే చాలా అల్పసంఖ్యాక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన. అయితే ఆయన ఢీకొన్నది ఉన్నత వర్గాలకు చెందిన బ్రాహ్మణ, రెడ్డి సామాజిక వర్గాల పెద్దలతోనూ, పాలకవర్గమైన నవాబులతోనూ కావడం విశేషం. ఇది ఆయన ధైర్యానికి నిదర్శనం. అప్పటిలో ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడని మైనార్టీ వర్గానికి చెందిన సిద్ధయ్యను శిష్యుడిగా చేసుకోవడం, కక్కయ్య అనే దళితుడి ఇంటికి వెళ్లి ఆయన మనస్తాపం చెందుతుంటే ఆ సామాజిక వర్గానికి మద్దతుగా కొన్నితత్వాలు బోధించి వారూ ఉన్నతస్థితికి వస్తారని ఊహించి చెప్పడం బ్రహేంద్రస్వామిలో జీర్ణించుకున్న సంస్కరణాభిలాషకు మచ్చు తునకలు. ఇప్పటికీ కక్కయ్య గుడి, సిద్ధయ్య సమాధి దర్శనీయ స్థలాలుగా మారాయంటే అది వీరబ్రహ్మం చూపిన విశేష చొరవే కారణం. ఆ సామాజిక వర్గాల అభ్యున్నతికి ఓ 400 ఏళ్ల క్రితమే ఆయన యత్నించడం అసాధారణ విషయంగా చెప్పాలి.
అధికం సామాజిక కోణమే
భక్తి పునాదిగా నడిచే ఆ రోజుల్లో ‘వజ్రాన్ని వజ్రంతోనే ’ కోయాలన్న సూత్రాన్ని బ్రహ్మంగారు అనుసరించారని అనిపిస్తోంది. ఆయన వివిధ మకుటాలతో 14వేల తత్వాలు చెప్పారు. ఎక్కువగా గోవింద మకుటం, వీరకాళికాంబ మకుటంతో రాసినవి, పాడినవి ప్రాచుర్యం చెందాయి. వీటిలో కొన్ని వేరేవి చేరాయన్న వాదనలు ఉన్నప్పటికీ మఠం వారు సేకరించి ప్రచురించినవి, ఆయనే స్వయంగా రాశారని చెబుతున్న తాళపత్ర గ్రంథాల్లో పేర్కొన్న తత్వాలు మనం కచ్చితమైన ఆధారాలుగా తీసుకుని విశ్లేషిస్తే సామాజిక కోణం అర్థం అవుతుంది.

– పట్నాయకుని వెంకటేశ్వరరావు,
సీనియర్​ జర్నలిస్ట్​
97053 47880,
97047 72790