Breaking News

ఆడపిల్ల మనగాలి.. అబ్బాయి మారాలి

ఆడపిల్ల మనగాలి.. అబ్బాయి మారాలి

అవును ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య ఎక్కడినుంచి మొదలు పెట్టాలన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. స్త్రీ లోకం కోసం మాట్లాడేందుకు ఎన్నో శ్లోకాలు. ‘యత్రనారీయంతు..’ అంటూ కోకొల్లలు. ఇక మన శక్తిమంతులైన దేవతామూర్తులంతా మాతృస్వరూపులే. వారికి మొక్కని రోజు ఉండదు. కోరని వరాలు ఉండవు. ఇలా లక్ష్మీ, సరస్వతి, పార్వతి, దుర్గ, కాళికా, చండిక.. ఒక్కరేమిటి లెక్కకు మిక్కిలి. మరి అన్ని శక్తులను అమ్మరూపంగా ఆరాధిస్తున్న మనం ఆడపిల్లల పట్ల చూసే చూపులోనే తేడా వస్తోంది ఎందుకు. ఎక్కడిదీ లోపం. ఎక్కడనుంచి ఈ ప్రశ్న వేసుకుని ఆకాశంలో సగమంటూ చెప్పుకునే ఆడపిల్లల మనుగడను ముందుకు తీసుకెళ్లాలి. ఇంతకుముందెన్నడూ లేని ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఫ్యూడల్ వ్యవస్థలో సైతం చూడని దారుణాలు అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు గురజాడ చెప్పిన పుత్తడి బొమ్మల పూర్ణమ్మ లేరు. ముత్యాల సరాల సన్నివేశం కంటే దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందులో ఆమె.. ఆ పట్టణ రాజును నిలదీసి.. అగ్నికి ఆహుతవుతూనే అతని తన చేయిపట్టుకుని రమ్మని సవాల్చేస్తుంది. ఆఖరికి ఆత్మబలిదానం ద్వారా తన ఆత్మాభిమానం చాటుతూ ఆడపిల్లను రక్షించుకునే వ్యవస్థ కావాలనీ రాజే కాదు ఎంతటి బలవంతుడైనా, క్రూరుడినైనా ఎదిరించి అంతమొందించగల శక్తి పెంపొందించుకోమని తన బంధువులకు హితబోధ చేస్తుంది. తనపై జరుగుతున్న ఆకృత్యాన్ని ఎదిరించలేని తండ్రి, బంధువులు, ప్రజల దీనస్థితిని చూసి పౌరుషం తెచ్చుకోమని కోరుతుంది. అనివార్యమైతే యుద్ధం చేయాలంటుంది. ఆఖరికి అగ్నిపునీత అవుతుంది. ఆ సమయంలో తన పిలుపునందుకోకుండా పారిపోయిన రాజు భీరత్వాన్ని ఎత్తి చూపి ఆహుతవుతుంది. అంటే అన్ని కాలాల్లోనూ ఆడపిల్లల రక్షణ అతి పెద్దసవాల్​ అని మనకు అర్థమవుతున్నా ఇప్పుడూ అమ్మ పొత్తిళ్లలోని బిడ్డలపైనే అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే మనం ఎక్కడికి పోతున్నామో ఆలోచించుకోవాల్సిన తక్షణ తరుణం ఆసన్నమైంది.

యావద్భారతాన్ని కుదిపేసిన ‘దిశ’,‘సమత’ సంఘటనతో పాటు ‘నిర్భయ’ ఘటనలు నేర్పుతున్న పాఠాలు. ఇందులోని నేరస్తుల స్వభావాలు, నూనూగు మీసపు ప్రాయంలోనే ఘోరమైన నేరస్థితికి కారణాలు ఏమిటి, ఇందుకు పరిష్కారాలు ఎక్కడ వెతికితే దొరుకుతాయంటే తొలిచూపు ఇంటిపైనే సారించాల్సి ఉంది. పిల్లల పెంపకంలోనే కొడుతున్న తేడా చివరికి ఇలాంటి దుస్థితి, ఒక్కోచోట వయసుతో ప్రమేయం లేని దారుణాలకు కారణమవుతోంది. మన తెలుగు మూలాలను మరచి, భారతీయతను విస్మరించి చేస్తున్న ప్రయాణాలతో ఈ పరిస్థితులు దాపురిస్తున్నాయి.
ఇంట్లో సంబంధాలు తెగి ఎవరిలోకం వారిదన్న పోకడలు పెరిగి అంతా పక్కచూపులు చూస్తున్నారు. తల్లిదండ్రులు పాత్ర గతి తప్పింది. కుటుంబం మొత్తం కలిసి కూర్చుని నాలుగు మాటలు పంచుకునే విషయం ఎప్పుడో మరిచిపోయాం. ఎవరు బంధువులో, ఆప్తులో, సన్నిహితులో, స్నేహితులో అనే నిర్వచనం, వావివరుసలను వివరించే స్థితిలేదు. అందరికీ సమానార్థక వరుసలైన ఆంటీ, అంకుల్వంటి వాటితో అనురాగం చిదిమేస్తున్నాం. ఇంట్లో ఉన్నా అంతా ఒక్కటిగా కాకుండా ఒంటరిగా బతుకుతున్నాం. ఇలాంటి స్థితితోలోనే ఆధునిక మాధ్యమాలు మనపై, పిల్లలపై, చివరికి వయోధికులపై కూడా దాడి చేస్తున్నాయి. ఫలితంగా వ్యక్తి నిర్మాణమే మారిపోతోంది. చదువులున్నా సంస్కారం అద్దలేకపోతున్నాం. సంఘం పట్ల భావన మారిపోతోంది. సాటి వారిని గౌరవించే సంప్రదాయం తగ్గుతోంది.

ఇలాంటి అంశాలపై ఆవేదన చెంది అలసిపోయే కంటే అడుగు ముందుకు వేస్తేనే ఆచరణాత్మకమవుతుంది. ఈ మరమ్మతు ఇంటినుంచే మొదలుపెట్టాలి. ఆడపిల్ల, మగపిల్లాడి పెంపకం నుంచే ఇరువురికీ పరస్పరం గౌరవించుకునేలా పెంచాలి. ఆడపిల్లలని అతిఅనురాగం, అబ్బాయికి అతి స్వేచ్ఛ రెండూ ప్రమాదకరమే. వారు ఇంటికే పరిమిత మయ్యేవారు కాదు. రానున్న తరానికి ప్రతినిధులు అందుకే ఆ స్పృహను వారిలో రేకెత్తించాలి. ఇదీ ఉబుసుపోని ఉపన్యాసాలతో కాదు.. తల్లిదండ్రుల ఆచరణాత్మక విధానమే వారికి మార్గదర్శనం కావాలి. వ్యత్యాసం, వివక్ష లేని ధోరణితో పెంచాలి. బేలతనం ఇరువురికీ ప్రమాదకరమే. వాస్తవానికి అబ్బాయి కుటుంబ రక్షకుడిగా ఉండాలి. అమ్మాయి సంరక్షకురాలిగా ఎదగాలి. సమస్యలు ఎదుర్కొనే నేర్పరితనం వారికి నేర్పించాలి. ఇటీవలి ‘దిశ’ సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఆమె అమాయకత్వపు బేలతనం ప్రదర్శించి ముప్పును అంచనా వేయలేకపోయింది. ఫలితంగా జీవితం కోల్పోయింది. కుటుంబానికి క్షోభ మిగిలింది.
చరిత్రలో శివాజీ తల్లి జిజియాభాయి గొప్ప ఉదాహరణ. ఆమె కుమారుడికి చిన్నతనం నుంచే ధీరత్వం అద్దడంతో ఆయన ఛత్రపతి కాగలిగాడు. అలుపెరుగని పోరాటం చేసి చరితార్థుడయ్యాడు. అలాగే మహాత్మాగాంధీ జీవితంలో పుత్లీభాయి పాత్ర అద్భుతం. అదే విధంగా స్వామి వివేకానందుడి మాతృమూర్తిభువనేశ్వరీదేవి ప్రభావం ఆయనపై ఎంతో ఉంది. ఇలా తల్లిదండ్రులు కుటుంబంలో స్ఫూర్తిమంతులుగా మెలగాలి. కుటుంబంలోకి అడ్డగోలుగా ప్రవేశించిన ఫేస్బుక్, యూట్యూబ్, టిక్టాక్, వికృతక్రీడ పబ్జీ వంటి వాటి నుంచి మనల్ని మనం సంరక్షించుకోవాలి. మనం తయారుచేసిన యంత్రాలో, కంప్యూటర్ ప్రోగ్రామో మనల్నే మింగుతుందంటే అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముందు ఈ మాధ్యమాలకు బానిసత్వం కావడాన్ని దూరంచేయాలి. వాటిపై మనకు నియంత్రణ ఉండాలి.
మన ఆరాధనలో ఆమె శక్తిస్వరూపం ఆచరణలో వస్తు స్వరూపంగా చూస్తున్నాం. ఈ ధోరణే మగపిల్లల్లో ప్రబలుతోంది. తనకోసం పుట్టిన ఓ వస్తువుగా ఆమెను దోచుకోవడమో, దాచుకోవడమో, లేకుంటే అంతమొందించడమో అనే ప్రాతిపదికనే చూస్తున్నారు. ప్రమేయం లేకుండానే యాసిడ్కుమ్మరిస్తున్నారు. కత్తులకు బలిచేస్తున్నారు. అదీ వీరోచితంగా భావించి వారే పోలీసులకు లొంగిపోవడం ఓ విధానంగా మారిపోతోంది. మగ పిల్లల ధోరణిని ముందుగా ఇళ్లల్లో తల్లిదండ్రులు మార్చాల్సి ఉంది.


మనం ఆనాటి సతీసావిత్రి, సీత, వంటి సాధ్వీమనులనే స్మరించుకుని కూర్చోనక్కర్లేదు. ఈ తరంలో స్ఫూర్తివంతులుగా నిలుస్తున్న సుధానారాయణమూర్తి, క్రీడాకారిణులు సింధు, హంపి, సానియామీర్జా ఇలా వీరే ఏమిటి ఇలాంటి వారు ఎందరో స్త్రీలు సత్తాచాటుతున్నారు. సైన్యంలో చేరిన ధీరవనితలు ఈరోజు సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో వణుకుపుట్టించేలా కర్తవ్యం నిర్వహిస్తున్నారు. ఇక మేధాపాట్కర్వంటి వారి పోరాటస్ఫూర్తితో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపుతున్నారు. ఇలాంటి వారిని అనుకరించడం కాదు అనుసరించే ప్రయత్నం చేయడం అవసరం. పాఠ్యాంశాలను వాస్తవిక కోణంలో అధ్యయనం చేస్తే నిజజీవితం అర్థమవుతుంది. వ్యక్తిగతంగా సమాజాన్ని, ఎదుటి మనిషిని అంచనావేస్తే సత్తా సమకూరుతుంది. ఇది ఆడపిల్లలు ఆచరణలోకి తేవాలి. వారి భూమికపై వారికో స్పష్టత ఏర్పడాలి. ఇంట్లో అమ్మానాన్నలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కంటే ఆత్మీయులు ఉండరన్న ప్రాథమిక విషయాన్ని గుర్తెరిగి వారితో మనసు పంచుకుంటే వారి జీవితంలో చక్కని పరిష్కారాలు లభిస్తాయి. అలాగే తమకు అవసరమైన ఆధునిక రక్షణ యాప్లను, పరికరాలను వినియోగించుకోవాలి. తమకంటూ ఓ చక్కనిబాట వేసుకుంటే భారతనారి, అందులో తెలుగు ఆడపడుచు ఎప్పుడూ ధీరవనితగానే నిలుస్తుంది. అద్భుత చరిత్రను ఆవిష్కరిస్తుంది. ఆ దిశగా వారి ప్రయాణం సాగాలి. అప్పుడే ‘అమ్మా నమామి.. సదాస్మరామి’ అనేలా ఆడబిడ్డ ఎదుగుతుంది. ఏడైనా విజేతగా నిలుస్తుంది.

పట్నాయకుని వెంకటేశ్వరరావు
సీనియర్​ జర్నలిస్టు
సెల్​నం.97053 47880