Breaking News

ఎమ్మెల్యే మర్రికి చేదు అనుభవం

ఎమ్మెల్యే మర్రికి చుక్కెదురు

అడ్డుకున్న వట్టెం భూనిర్వాసితులు

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి చుక్కెదురైంది. వట్టెం రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే అదనంగా లక్ష రూపాయలు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాట ఇచ్చి నాలుగేళ్లు గడిచినా నేటికీ నెరవేర్చలేదని వట్టెం భూనిర్వాసితులు, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని సోమవారం సాయంత్రం వట్టెం గ్రామంలో అడ్డుకున్నారు. ఆసరా పింఛన్ పంపిణీలో భాగంగా వట్టెం గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు అర్హుల పత్రాలను అందజేయడానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వచ్చారు. ప్రసంగానికి వట్టెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ అడ్డుతగిలి గతంలో మీరు ఇచ్చిన హామీలు నీటి నెరవేరలేదని, ప్రజలను మభ్యపెట్టవద్దని నిలదీశారు. అక్కడే ఉన్న పోలీసులు భూనిర్వాసితులు, కాంగ్రెస్ నాయకులను సభా వేదిక నుంచి తోసివేశారు. ఒక్కసారిగా సభావేదిక ముందుకు కాంగ్రెస్ నాయకులు చొచ్చుకొని రావడంతో ఎస్సై ఓబుల్​రెడ్డి వారిని అడ్డుకున్నారు. సమస్యలు ఉంటే సర్పంచ్ కు చెప్పుకోవాలని, ఎమ్మెల్యేకు చెప్పుకోవద్దని వారించారు. వేలాది ఎకరాల భూములు రిజర్వాయర్ కింద కోల్పోయి ఇచ్చిన మాట కోసం వచ్చిన తమను సర్పంచ్ కు చెప్పుకోవాలని ఎస్సై చెప్పడం ఏమిటని నిలదీశారు. గందరగోళం మొదలైన వెంటనే ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేసి అక్కడి నుంచి ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి వెళ్లిపోయారు.

నిరసన వ్యక్తం చేస్తున్న నిర్వాసితులు