Breaking News

ఉమామహేశ్వరం.. బ్రహ్మోత్సవాలకు సిద్ధం

ఉమామహేశ్వరం.. బ్రహ్మోత్సవాలకు సిద్ధం
  • 15 నుంచి ఉత్సవాలు ప్రారంభం

సామాజిక సారథి, అచ్చంపేట :  రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. నల్లమల వాసుల ఆరాధ్యదైవం ఉమామహేశ్వర క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు జరిగే గణపతి, అయ్యప్ప పూజతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. అధికారికంగా మాత్రం 15న జరిగే ప్రభోత్సవంతో మొదలై.. ఈ నెల 22న ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు వేల సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుంటారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్‌ గ్రామానికి ఏడు కి.మీ దూరంలోని నల్లమల కొండపై ఆలయం ఉంది. వేడుకల నిర్వాహణకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ కందూరు సుధాకర్‌ ఆధ్వర్యంలో పూర్తి చేశారు.

 మహిమానీత్వం.. క్షేత్రం

శ్రీశైల ఉత్తర ముఖద్వారంగా బాసిల్లుతున్న క్షేత్రాన్ని క్రీ.శ 1232లో కాకతీయ వంశీయులు నిర్మించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. పార్వతిదేవి పరమశివుని కోసం తపస్సు చేసిన ప్రాంతంగా స్కంధపురాణం చెబుతోంది. ఆలయ గర్భగుడిలో శివుడు తుమ్మెద మామిడి చెట్టుకింద కొలువై ఉన్నాడు. శివుడి ఝఠాఝుటంలో చంద్రుడు ఉన్నాడు. కాలిదాసు రాసిన కుమారసంభవంలో ‘ఉ” ఉంటే తపస్సు, ‘మా” అంటే వద్దు అని అర్థంగా ఉంది. అంటే పార్వతిదేవికి తల్లిదండ్రులు మేనక, హిమవంతుడు వద్దని చెప్పినా.. శివుని కోసం తపస్సు చేసిన ప్రాంతం కావడంతో ‘ఉమా” మహేశ్వరం అనే పేరు వచ్చిందని ఉంది. స్వామివారి గర్భగుడి పక్కనే పార్వతిదేవి, విఘ్వేశ్వరుడు, మహిషాసురమర్థిని, అయ్యప్పస్వామి దేవతలు కొలువై ఉన్నారు.

– సర్వపాప నివారిణి.. పాపనాశిని..

కొండపైన ఆలయానికి కొద్ది దూరంలో కుడివైపున పాపనాశిని గుండం ఉంది. ఇక్కడ కొండల మధ్య నుంచి నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఉత్తరాయణంలో ముక్కోటి దేవతలు ఇక్కడే స్నానాలు చేసి స్వామిని ప్రసన్నం చేసేందుకు వెళ్తారని పురాణంలో ఉంది. అందుకే మకర సంక్రాంతి ఆరంభమయ్యే ఉత్తరాయణంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కొండపై 11 తీర్థములు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి రుద్రధార, భస్మధార, గౌరిధార, పాపనాశనము ప్రధానమైనవి.

– బోగమహేశ్వరం.. కల్యాణ మండపం

కొండ దిగువ ప్రాంతాన్ని బోగమహేశ్వరంగా పిలుస్తారు. కింద పంచలింగాల గుడి, జంఠలింగాల ఆలయాలు ఉన్నాయి. కోనేరు, గాలిగోపురం, కల్యాణమండపం, ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి.

-ప్రత్యేక ఏర్పాట్లు

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉత్సవాల నిర్వాహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము. ఆలయ ప్రాంగణం శానిటైజేషన్‌ చేయించాము. కరోనా నేపథ్యంలో ఆలయంలోని అభిషేక పూజలకు భక్తులకు అనుమతించడం లేదు. బ్రహోత్సవాలకు వచ్చే భక్తులు తప్పని సరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలి.  అచ్చంపేట నుంచి రంగాపూర్‌, అక్కడి నుంచి బోగహేశ్వరం, కొండపైకి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

   .. శ్రీనివాసరావు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి, ఉమామహేశ్వర ఆలయం..