Breaking News

కమ్ముకున్న మేఘాలే ముంచాయి

కమ్ముకున్న మేఘాలే ముంచాయి
  • సీడీఎస్‌ చీఫ్ ​బిపిన్​ రావత్​..హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణమిదే..
  • సాంకేతిక కారణాలు ఏమీ లేవు
  • దుర్ఘటనపై త్రివిధ దళాల బృందం దర్యాప్తు

న్యూఢిల్లీ: గత డిసెంబర్‌ 8న చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన హెలికాప్టర్‌ కిందికి దిగుతున్న సమయంలో కమ్ముకున్న మేఘాల వల్లే ప్రమాదం జరిగిందని త్రివిధ దళాల దర్యాప్తు బృందం వెల్లడించింది. బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తో భారత వాయుసేనకు చెందిన ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ నేతృత్వంలోని త్రివిధ దళాల బృందం భేటీ అయ్యి దర్యాప్తు వివరాలను ఓ నివేదికలో ఆయనకు అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. హెలికాప్టర్‌ ప్రమాదానికి గురికావడానికి కారణం సాంకేతికలోపం కాదని ఈ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురయ్యే ముందు ఈ హెలికాప్టర్‌ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తోందని, ఓ రైల్వే లైను గుండా అది వెళ్తోందని, ఆ సమయంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉన్నాయని ఈ కారణంగా ప్రమాదం జరిగి జనరల్‌ రావత్‌, ఆయన సతీమణి మధులికరావత్, మరో 12మంది మృతి చెందినట్లు ఈ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. దీనిలోని సిబ్బంది అత్యున్నత స్థాయి నిపుణులని, అయితే పరిస్థితిపై సరైన అవగాహన లేకుండా, పైలట్‌ నియంత్రణలో హెలికాప్టర్‌ ఉన్నప్పటికీ, అనుకోకుండా భూమిపైకి దించారని ఈ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మొత్తానికి ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ నేతృత్వంలోని కోర్ట్‌ ఆఫ్‌ ఇంక్వైరీ దర్యాప్తు పూర్తిచేసిందని, అన్ని కోణాల్లోనూ పరిశీలించి ఈ నివేదికను రూపొందించారని స్పష్టమవుతోంది.