Breaking News

ఫ్యామిలీకి రూ.10లక్షలు

ఫ్యామిలీకి రూ.10లక్షలు
  • ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి
  • గ్రామగ్రామానా మొహల్లా క్లినిక్స్‌
  • నెలకు రూ.3వేల నిరుద్యోగభృతి
  • గోవా ప్రజలకు ఆప్​వరాల జల్లు
  • సీఎం కేజ్రీవాల్ సంచలన పథకాలు

పానాజి: ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీల హామీల వర్షం కురుస్తోంది. ఫ్రీ పథకాల జోరు కొనసాగుతోంది. ప్రధానపార్టీల నేతలంతా ఓటర్లను ప్రసన్నంచేసుకునే పనిలో పడ్డారు. తాజాగా గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక పథకాలను ప్రకటించారు. ఈ మేరకు ప్రధానంగా 13 పాయింట్లతో తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గోవా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని కొత్త భరోసా ఇచ్చారు. ఒకవేళ ఉద్యోగం రాకపోతే నెలకు రూ.మూడువేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. అలాగే 18ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి ఆర్థికసాయం చేస్తామని పేర్కొన్నారు. 24 గంటలు విద్యుత్, మంచి నీటి సరఫరా, ఉచిత విద్య అందిస్తామన్నారు ప్రకటించారు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. గోవాలోని రోడ్లకు మరమ్మతులు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా సర్కారు స్కూళ్లలో విద్యార్థులకు మెరుగైన, ఉచిత నిర్బంధ విద్య అందిస్తామని ప్రకటించారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే భూహక్కుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రైతులతో చర్చించి వారి సమస్యలనూ తీరుస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్స్‌ ప్రారంభించి ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

  • ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు

ఆప్ కు ఓటు వేస్తే సంక్షేమ పథకాల ద్వారా గోవాలో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు అందుతాయని, అలాంటప్పుడు రూ.రెండువేలు తీసుకొని ఇతర పార్టీలకు ఓటు వేయడం ఎందుకని అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. గోవాలో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 40 నియోజకవర్గాలకు ఒకేదశలో పోలింగ్‌ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడవుతాయి. పశ్చిమబెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. దీంతో గోవా ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.