Breaking News

పంచమఠ పీఠభూమి.. పొట్లపల్లి

పంచమఠ పీఠభూమి.. పొట్లపల్లి

ఆ ఊరే ఆలయ ప్రాంగణంలో కట్టినట్టు ఉంటుంది. పరిసరాలన్నీ శాసనాలున్న చారిత్రాత్మక ప్రదేశంగా వెలుగొందుతోంది. ఒకప్పుడది గొప్ప ఆలయంగా విరాజిల్లింది. ప్రజలు మొక్కులు తీర్చుకొనే ఆధ్యాత్మిక కేంద్రంగా.. రాజులు పరిపాలన చేసే పాలనా కేంద్రంగా చరిత్రలో నిలిచిపోయింది పొట్లపల్లి. ఇక్కడి శివాలయం, శిలాశాసనం, తవ్వకాల్లో బయటపడిన వస్తువులకు ఎంతో విశిష్టత ఉంది.

సారథి న్యూస్, హుస్నాబాద్: పొట్లపల్లి. క్రీ.శ 1066లో పశ్చిమ చాళుక్య రాజైన త్రైలోక్య మల్లన్న దేవరాయ కాలపు శిలాశాసనం పొట్లపల్లి చరిత్ర, ఆధ్యాత్మిక నేపథ్యాన్ని చెబుతోంది. కాకతీయుల వంశానికి చెందిన మొదటి ప్రోలరాజు 1055-75 మధ్య కాలంలో పొట్లపల్లిలో శివాలయం నిర్మించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో ఉంది. హైదరాబాద్ నుంచి సిద్దిపేట 100 కి.మీ. దూరంలో ఉంది. సిద్దిపేట నుంచి హుస్నాబాద్ 40 కి.మీ. హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకునేవాళ్లు నేరుగా సిద్దిపేటకు చేరుకుని అక్కడి నుంచి హుస్నాబాద్ వెళ్లి అక్కడి నుంచి 3 కి.మీ.దూరంలో పొట్లపల్లి శివాలయం ఉంది.

ఇదీ విశిష్టత
పొట్లపల్లి శివాలయాన్ని మొదటి ప్రోలరాజు నిర్మించాడు. ఒక్క శివాలయమే కాకుండా పొట్లపల్లిలోని ప్రతి కట్టడం చారిత్రాత్మక నేపథ్యం కలిగి ఉంటుంది. ప్రతి గజం స్థలంలో ఏదో ఒక విశిష్ట కట్టడం నిర్మించి ఉంది. ఒకప్పుడు పొట్లపల్లి జైనుల కేంద్రంగా విరాజిల్లింది. బృహత్ శిలాయుగం నాటి మానవుల సమాధులు.. నాగజాతికి చెందిన నాగులమ్మలు పొట్లపల్లిలో కనిపిస్తాయి. కాకతీయుల వారసులుగా శైవమతస్తులు పొట్లపల్లిలో పంచమఠ పీఠాన్ని ఏర్పాటుచేసి 300 ఏళ్లు పాలించినట్లు ఇక్కడ లభించిన శిలాశాసనాల ద్వారా తెలుస్తోందని చరిత్రకారులు చెబుతున్నారు.

శివలింగోద్భవం
పొట్లపల్లికి చెందిన కుమ్మరి పోచయ్య ఇంట్లో కాకతీయుల కాలంనాటి అరుదైన శివలింగం బయల్పడింది. తమ మేలుకోరే శివుడు వెలిశాడని గ్రామస్తులు కొలిచి పూజించారు. అప్పటివరకు చినుకు కూడా పడని పరిస్థితుల్లో శివలింగం బయల్పడిన తర్వాత కుంభవృష్టితో వర్షం కురిసిందట. సాక్షాత్తు వరుణ దేవుడే వచ్చి శివలింగానికి జలాభిషేకం చేశాడని భక్తుల విశ్వాసం. నాటినుంచి స్వామివారిని స్వయంభు రాజరాజేశ్వరుడిగా నిత్యం కొలుస్తూ పూజలు చేస్తున్నారు.

శైవమత ప్రచార కేంద్రం
త్రైలోక్యమల్ల మొదటి సోమేశ్వరుడి కాలం నాటి కన్నడ శాసనమొకటి ఇక్కడ లభించింది. దీనిప్రకారం మహా సామంతుడు రేగొండ చంద్రయ్య రాజు ఈ దేవాలయానికి కానుకలు ఇచ్చాడు. ఆ కాలంలో ఈ ప్రాంతం పేరు పొట్లపల్లి అయింది. ఈ గ్రామంలో ఐదు మఠాలు ఉండేవి. ఆ మఠాలలో వేలాది మునులు తపస్సుచేసేవారట. శాసనానికి మూడువైపులా ఇదే విషయం చెక్కి ఉంది. మొదటి వైపు 27 వరుసలు.. రెండోవైపు 21 వరుసలు మూడో వైపు శాపం చెక్కి ఉన్నాయి. శాసనం రెండవ పక్కలో నకరేశ్వర దేవాలయ ప్రసక్తి ఉంది. ఎల్లమ్మగుట్ట, బోడగుట్టలో చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి.

తవ్వకాల్లో బయటపడిన విగ్రహం, శిలాశాసనం

పంచమఠాలు
ఎల్లమ్మగుట్ట దిగువన ఐదు తలలతో నాగుల విగ్రహాలు నాగదేవతను ఆరాధిస్తూ ప్రతిష్టించిన ఏడు నాగులమ్మల విగ్రహాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం 230 నుంచి క్రీస్తుశకం 100 వరకు శాతవాహనుల పరిపాలనలో ఈ గ్రామం ఉండేది. అప్పుడు పొట్లపల్లిలో సుమారు 400 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవట. వారు నివసించిన స్థలాన్నే ఇప్పడు బ్రాహ్మణుల దిబ్బగా పిలుస్తున్నారు. శాతవాహనుల అనంతరం కళ్యాణి చాళుక్యులు పరిపాలన చేసినట్లు గ్రామస్తులు చెబుతుంటారు. రెండో ప్రోలరాజు రెండో బేతరాజులు పొట్లపల్లిని పరిపాలించారు. వీరి పాలనలో ఇక్కడ పంచమఠ స్థానాలు ఉండేవి. పొట్లపల్లి రామాలయానికి సాగు నీరును తోడే మోట రాట్నాన్ని కళ్యాణి చాళుక్యరాజు త్రిలోకమల్లదేవుని మహాసామంతుడు రేగొండ రాజు చంద్రయ్య క్రీ.శ 1066లో దానం చేసినట్లుగా ఆలయ శిలాశాసనంలో ఉంది. పద్మాసనంలో ధ్యానముద్రలో ఉన్న నల్లరాతితో చెక్కిన జైన తీర్థంకరుడి విగ్రహం మల్లన్న ఆలయం ఎదురుగా ఉంది. ఈ విగ్రహం రెండు భుజాలను నరికివేశారు. గ్రామం మధ్యలో ఒక బురుజు ఉంది. దీని పైభాగంలో ద్వారపాలకుడి విగ్రహం ఉంది. రామాలయం 28 స్తంభాలతో నిర్మించి ఉన్నది.

ప్రాచీన సమాధులు
పొట్లపల్లి సమీపంలో ఎల్లమ్మగుట్ట ఉంటుంది. గుట్టకింద భాగంలో బృహత్ శిలాయుగంనాటి సమాధులు కనిపిస్తాయి. వీటి సంఖ్య సుమారు 40కి పైమాటే. ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ జైకిషన్.. రీసెర్చ్ స్కాలర్‌లు స్మృతి చరణ్, రిషబ్, తత్‌గత్, పరిశోధకుడు నాగేంద్ర శర్మ ఈ సమాధులపై ఆధ్యయనం చేశారు. ఇవి క్రీ.పూ. 2500 నాటివిగా గుర్తించారు. ఈ సమాధులకు ఆవల పోచమ్మ గుడి, ఎల్లమ్మ గుడి, వినాయకుడు.. హనుమంతుడి విగ్రహాలున్నాయి. ఇక్కడ ఏటా ఉత్సవాలు జరుగుతాయి.

పొట్లపల్లి ఆలయం

ఆధ్యాత్మికతకు నిలయం
పొట్లపల్లి గ్రామ పొలిమేర మొదలు అడుగడుగునా మనల్ని ఆలయాల ఆనవాళ్లు పలకరిస్తుంటాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లిందని చరిత్రకారులు చెబుతున్నారు. క్రీ.శ.1055-75 మధ్య కాలంలో పశ్చిమ చాళుక్య రాజు అయిన త్రైలోక్య మల్లన్న దేవరాయ కాలంలో ఇక్కడ పెద్ద సంఖ్యలో శివాలయాలను నిర్మించారని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. కాకతీయుల వంశానికి చెందిన మొదటి ప్రోలరాజు హయాంలోనూ ఈ గ్రామం ఆలయాలతో వెలుగొందిందని చెబుతున్నారు.

ఎన్నో శిలాశాసనలు
పొట్లపల్లి గ్రామ పరిసరాల్లో ఎక్కడ తవ్వినా శిలాశాసనాలు, దేవతా విగ్రహాలు, శివలింగాలు, బుద్ధుడి మూర్తులు, జైనతీర్థంకరుల విగ్రహాలు బయటపడుతుంటాయి. కొత్తగా నిర్మించిన శివాలయ గోపురం కోసం తీసిన పునాదిలో సుమారు 500 ఏళ్ల నాటి గాజుబావి బయటపడింది. పలు చోట్ల శైవమతానికి చెందిన ఆధారాలు ఎక్కువగా లభిస్తుండడంతో ఇక్కడ శైవం విరాజిల్లిందని చెబుతుంటారు. బౌద్ధ, జైన మతాలు సైతం ఉనికిని చాటుకున్నట్లు గుర్తించారు. పొట్లపల్లి గ్రామ శివారులోని ఎల్లమ్మగుట్ట(బోడగుట్ట) చుట్టుపక్కల ఎక్కడ చూసినా నాగదేవతల విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. పెద్ద పెద్ద రాళ్లపై మనిషి ముఖం, సర్పదేహంతో ఉన్న మూర్తులు కనిపిస్తాయి. 11 పడగలతో ఖడ్గం, కిరీటం ధరించిన విగ్రహాన్ని నాగరాజుగా, ఏడు తలలతో కనిపించే విగ్రహాన్ని యువ నాగరాజుగా, మూడు తలల మూర్తిని యువరాణిగా స్థానికులు భావిస్తుంటారు. గుట్ట గుహలోని ఎల్లమ్మ విగ్రహానికి ఇప్పటికీ పూజలు చేస్తుంటారు. గుట్టపైన శిథిలమైన వినాయకుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు ఉన్నాయి. రేణుకానది ఒడ్డుతో పాటు గుడి బండలు, చింతతోపు, దామెరకుంట, బోడగుట్ట, మైసంబొత్తాలు, నాగులగడ్డ తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పురాతన విగ్రహాలు, శిల్పాలు తారసపడుతూనే ఉంటాయి. అంతేకాదు, ఆలయాలు నిర్మించే కాలంలో పొట్లపల్లి శివారులో శిల్పుల కోసం భారీగా పందిళ్లు వేసేవారట. అక్కడే శిల్పాలు చెక్కేవారట. కాలక్రమంలో ఆ ప్రాంతమే పందిల్ల గ్రామంగా రూపుదిద్దుకుందని చెబుతారు. రెండు దశాబ్దాల క్రితం ఇక్కడ పురాతమైన శివలింగం బయటపడింది. రేణుకానది ఒడ్డున కొత్త ఆలయం నిర్మించి దానిని పునఃప్రతిష్ఠించారు. రాజరాజేశ్వరుడిగా స్వామిని పూజిస్తున్నారు. రోడ్డు, ఇతర మౌలిక వసతులు మెరుగవ్వడంతో ఈ ఆలయానికి భక్తుల రద్దీ కూడా పెరిగింది. మహాశివరాత్రికి పెద్ద ఎత్తున జరిగే జాతరకు హుస్నాబాద్‌తో పాటు కరీంనగర్‌, సిద్దిపేట, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఎల్లమ్మగుట్ట, రేణుకా నది తీరానగల చిట్టడవుల్లో ఆదిమానవులకు సంబంధించిన రాకాసి గూళ్లు దర్శనమిస్తాయి. నది ఉప్పొంగడం ద్వారా పురాతన కాలంలో గ్రామం అంతా ముంపునకు గురై ఆలయాలు, శిల్పకళా వైభవం మొత్తం భూగర్భంలో కలిసి పోయిందని, ఆ తర్వాత పొట్లపల్లి పేరుతో ఈ గ్రామం మళ్లీ రూపుదిద్దుకుని ఉండొచ్చని చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు. మరింత లోతుగా పరిశోధనలు సాగిస్తే.. మరిన్ని అద్భుత విషయాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు. తాజాగా ఈ గ్రామంలో ఓ ఇంటిని నిర్మిస్తున్న క్రమంలో పానవట్టం బయటపడింది. దీంతో గతంలో ఇక్కడ నిర్మించిన మరో ఆలయం వెలుగులోకి వచ్చింది.

రుద్రమదేవి పాలన

నాగదేవతల విగ్రహాలు

కాకతీయుల కాలంలో శైవమతస్తులు పొట్లపల్లిలో పంచమఠ పీఠాన్ని ఏర్పాటుచేసి 300 ఏళ్ల పాటు పాలించినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. ఈ గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా ఆనాటి శివాలయాల ఉనికి బయటపడింది. రుద్రమదేవి పాలనలో ఇక్కడ పెద్దఎత్తున శివాలయాల నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది. దాదాపు వెయ్యి ఆలయాలను ఇక్కడ నిర్మించారని, ఇందుకోసం హుస్నాబాద్ సమీపంలోని పందిళ్ల గ్రామంలో పందిళ్లు వేసుకుని నివాసం ఉండి పొట్లపల్లిలో నిర్మాణాలు జరిపారని చెబుతుంటారు. పందిళ్లు వేసుకుని జీవనం సాగించినందునే ఈ గ్రామానికి పందిళ్ల అనే గ్రామంగా పేరుపడిపోయింది. రాణిరుద్రమదేవి స్వయంగా పందిళ్లలో మకాం వేసి ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ చేశారని కూడా తెలుస్తోంది. క్రీస్తుపూర్వం 230 నుంచి క్రీ.శ100 వరకు శాతవాహనుల పాలనలో ఉన్న పొట్లపల్లి గ్రామంలో 400 బ్రాహ్మణ కుటుంబాలు నివాసం ఉండేవని తెలుస్తోంది. ఎల్లమ్మగుట్ట సమీపంలో బృహత్ కాలం నాటి మానవులకు సంబంధించిన సమాధులు వెలుగులోకి వచ్చాయి. ఈ సమాధులు క్రీ.పూ2500 ఏళ్ల నాటివని పరిశోధకులు అంచనా వేశారు. కాకతీయుల తర్వాత పరిపాలనలో మార్పులతో ఈ ఆలయాలు ఆదరణకు నోచక కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే ఈ గ్రామంలో కొత్త నిర్మాణాలు చేపట్టినప్పుడల్లా నాటి ఆలయాల ఆనవాళ్లు బయటపడుతున్నాయి. తాజాగా ఒకరు ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా పానవట్టం బయటపడింది. ఈ పానవట్టం త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని పోలి ఉందని స్థానికులు చెబుతున్నారు.