Breaking News

పాలెంలో అమానవీయం!

– వీడని వివాహిత పుష్ప మర్డర్ మిస్టరీ

-‘గోవా గంజాయి బ్యాచ్’ కిరాతక చర్యపై అనుమానాలు

-పోలీసుల అదుపులో 8 మంది నిందితులు

సామాజికసారథి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న పాలెం గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత సూసైడ్ మిస్టరీ ఎట్టకేలకు వీడినట్లే వీడింది. సభ్యసమాజమే సిగ్గుతో తలదించుకునే ఆటవికచర్య వెలుగుచూసింది. ఈ ఘటన మానవత్వం మరిచిన మనుషుల అమానవీయం బయటపడింది. వివరాల్లోకెళ్తే.. బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన పుష్ప(30) భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హ్యాపీగా సాగుతున్న వారి కాపురంలో ఒక్కసారిగా విషాదకర ఘటన. ఈనెల 2వ తేదీన తన ఇంట్లోనే ఆమె అనుమానాస్పదస్థితితో ఉరివేసుకుని చనిపోయింది. కడుపునొప్పి భరించలేక ఉరివేసుకుని చనిపోయిందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదుచేశారు. కాగా,పోస్టుమార్టం అనంతరం పుష్ప మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అదే గ్రామానికి చెందిన ఆకుల శ్రీకాంత్ అనే యువకుడి ఇంటి ముందు శవాన్ని ఉంచి ఆందోళనకు దిగారు. పుష్ప చావుకు అతడే కారణమని భీష్మించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతురాలి కుటుంబసభ్యులు, బంధువుల చేత ఆందోళన విరమింపజేశారు. ‘పొద్దున కడుపు నొప్పి అని చెప్పి.. ఇప్పుడేమో యువకుడే హత్యచేసినట్లు, శవాన్ని అతడి ఇంటి ముందు పెట్టడం సరికాదు’ అని వారించారు. పోలీసులు నచ్చజెప్పడంతో మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు.

‘గంజాయి బ్యాచ్’ పనేనా..??
మూడు రోజుల రంగంలోకి దిగిన పోలీసులు పాలెం గ్రామానికి చెందిన మృతురాలు పుష్ప మర్టర్ మిస్టరీ ఛేదిస్తున్నారు. వారికి అనుమానం కలిగిన ప్రతి విషయాన్ని శోధించారు. ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగుచూడటంతో మరింత లోతుగా కేసును కూపీ లాగుతున్నారు. ఆమె మర్డర్ వెనుక ఓ గంజాయి బ్యాచ్ ఉన్నట్లు తేలిందని సమాచారం. ఆమెను పలుమార్లు గోవా తదితర ప్రాంతాలకు తీసుకెళ్లినట్లు తెలిసింది. గంజాయి మత్తులో ఆమెపై దారుణానికి ఒడిగట్టి కిరాతకంగా ప్రవర్తించినట్లు తెలిసింది. కొందరు ఆమెపై పశువాంఛ తీర్చుకున్న తర్వాత సభ్యసమాజం తలదించుకునే పనులకు పాల్పడినట్లు సమాచారం. ఇదిలాఉండగా, ఈ ఘటనలో పాలెం గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త గోవింద్ నాగరాజు, పాదాల మల్లిఖార్జున్, ఆకుల శ్రీకాంత్, స్టార్ రాజు, అక్రంతో పాటు మరో నలుగురిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ శుక్రవారం నాగర్ కర్నూల్ డీఎస్పీ ఆఫీసుకు వీరిని తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. పుష్ప చావులో వీరి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు మరింత కూపీ లాగుతున్నారు. కాగా, పాలెంలో గత ఐదేళ్ల నుంచి గంజాయితో పాటు అక్రమ మద్యం చాలా మంది యువకులను అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుష్ప మరణంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, నిందితులు ఎంతటివారైనా విడిచిపెట్టొద్దని కోరుతున్నారు.