Breaking News

ఐనవోలు జాతరకు ముమ్మర ఏర్పాట్లు

ఐనవోలు జాతరకు ముమ్మర ఏర్పాట్లు
  • అధికారులతో మంత్రి దయాకర్ రావు సమీక్ష

సామాజికసారథి, ఐనవోలు: వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆలయాధికారులు, అర్చకులను ఆదేశించారు. జనవరి 13,14,15 తేదీల్లో మూడు రోజులపాటు జరిగే జాతరకు భక్తులు అశేషంగా తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భద్రత, డార్మెటరీలు, చలువ పందిళ్లు, మంచినీటి వసతి, స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గదులు, మహిళలకు ప్రత్యేక వసతులు, క్యూ లైన్లు, విద్యుత్‌, సీసీకెమెరాలు, అన్నదానం తదితర అంశాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు. రూ.కోటి వ్యయంతో ఐనవోలులో శాశ్వత ప్రాతిపదికన పనులు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఆదేశించారు. ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం మహిమాన్వితమైనదని, తరచూ దర్శిస్తూ ఉంటానని మంత్రి చెప్పుకొచ్చారు. 700 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన ఆలయం ఇది. ఈ చరిత్రను మన ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆలయాన్ని రక్షించి సంరక్షించుకోవాలని కోరారు. పారిశుద్ధ్యం, మంచినీరు, స్నాన ఘట్టాలు, విద్యుత్‌ వంటి సదుపాయాలను మరింత అభివృద్ధి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆదేశించారు. సమావేశంలో ఆలయపాలకవర్గం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.