Breaking News

కేయూ విద్యార్థి బోడ సునీల్ మృతి

కేయూ విద్యార్థి బోడ సునీల్ మృతి

  • వ‌రంగ‌ల్‌లో మిన్నంటిన నిర‌స‌న‌లు..
  • కాకతీయ యూనివర్సిటీలో ఆందోళ‌న‌లు

సారథి, వ‌రంగ‌ల్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేష‌న్లు జారీచేయ‌డం లేద‌ని మ‌న‌స్తాపం చెంది గ‌తనెల 26న‌ పురుగు మందు తాగిన కేయూ విద్యార్థి బోడ సునీల్ నాయక్ శుక్రవారం నిమ్స్‌లో చికిత్సపొందుతూ మృతి చెందాడు. వారం రోజులుగా ప్రాణాల‌తో పోరాడిన సునీల్ చివ‌ర‌కు మృత్యుఒడికి చేరుకున్నాడు. మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన ఓ నిరుపేద గిరిజ‌న కుటుంబంలో పుట్టాడు. ప‌ట్టుద‌ల‌తో చ‌దివి జ‌న్మించాడు. కాకతీయ యూనివ‌ర్సిటీలో పీజీ చేస్తున్నాడు. ఎస్సై ఉద్యోగం సాధించాల‌నే ల‌క్ష్యంతో మూడేళ్లు వ‌ర్సిటీల్లో వివిధ కోర్సుల్లో కొన‌సాగుతూ ప్రిపేర‌వుతున్నాడు. ఉద్యోగ నోటిఫికేష‌న్లు జారీ చేయ‌కుండా ప్రభుత్వం నిరుద్యోగుల‌కు అన్యాయం చేస్తోంద‌ని సునీల్ తీవ్ర మ‌న‌స్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గ‌తనెల 26న కేయూలో పురుగు మందు తాగాడు. తాగాక సెల్ఫీ వీడియో తీసి స్నేహితుల‌కు వాట్సాప్ చేశాడు. ఆ వీడియోలో ‘నా పేరు బోడ సునీల్ నాయక్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతోంది.. ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు.. ఎలాంటి జాబులు లేవు. నేను చేతకాక చనిపోవడం లేదు.. రాష్ట్రంలో అందరికీ జాబు రావాలంటే నేను చావడమే కరెక్ట్. నా చావు చూసైనా కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలి. నిరుద్యోగుల్లారా కేసీఆర్‌ను వ‌ద‌ల‌కండి.. నా చావుకు ఆయ‌నే కార‌ణం‘ అంటూ పేర్కొన్నాడు.‌
అంబులెన్స్‌ రానివ్వకుండా ధ‌ర్నా
నిమ్స్ ఆస్పత్రి నుంచి సునీల్ మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామమైన గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండాకు శుక్రవారం సాయంత్రం 5:30 గంట‌ల‌కు త‌ర‌లించారు. అయితే అంబులెన్స్‌ను గ్రామ‌స్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వ‌ల్లే నిరుద్యోగి సునీల్ ఆత్మబ‌లిదానం చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని ఆందోళ‌న‌కు దిగారు. కాంగ్రెస్‌, బీజేపీ, వామప‌క్షాలు, ప్రజాసంఘాల‌తో క‌ల‌సి కుటుంబస‌భ్యులు కూడా మృత‌దేహాన్ని గ్రామంలోకి తీసుకురాకుండా అంబులెన్స్ ఎదుట బైఠాయించారు.
రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
ప్రభుత్వం తరఫున మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి రాత్రి 7 గంటల తర్వాత వచ్చి సునీల్ తల్లి మల్లిక, తండ్రి రాంధన్, అన్న శ్రీనివాస్, వదిన వనజ, కుటుంబసభ్యులతో పది నిముషాలు మాట్లాడి వెళ్లారు. మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పినట్లు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, దహన సంస్కారాల ఖర్చు కోసం రూ.ఒక లక్ష ఇస్తామని, గిరిజన సంక్షేమశాఖలో ఒకరికి ఉద్యోగావకాశం కల్పిస్తామని తెలిపారు. అయితే అందుకు సునీల్‌ కుటుంబ సభ్యులు, నాయకులు అంగీక‌రించ‌ లేదు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, ఎంటెక్ చదివిన సునీల్ అన్నకు ఆఫీసర్ ఉద్యోగం ఇవ్వాల‌ని, సునీల్ కోరినట్లుగా లక్ష ఉద్యోగాల ప్రకటన చేయాలనే డిమాండ్లను ప్రభుత్వం ఎదుట ఉంచారు.