Breaking News

కందనూలులో కబ్జా బ్రదర్స్!

కందనూలులో కబ్జా బ్రదర్స్!

సామాజికసారథి , నాగర్ కర్నూల్ బ్యూరో: అధికార పార్టీలో కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్న తమ్ముడు.. రియల్టర్‌గా వ్యవహరిస్తున్న అన్నదమ్ములిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంతకైనా బరితెగిస్తారని నాగర్ కర్నూల్ లో కోడై కూస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంతో పాటు కల్వకుర్తి, అచ్చంపేట పరిసర ప్రాంతాలలో సైతం వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వీరి టార్గెట్ ప్రభుత్వ భూముల కబ్జాలు.. చెరువులు… కుంటల కబ్జాలు అమాయక వ్యక్తుల భూములను కబ్జా చేసి తమ పలుకుబడి, డబ్బు బలం చూపి ఎంతకైనా తెగిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో పుట్నాలకుంటను కబ్జా చేసిన ఘటనలో అతనిపై అప్పట్లో నాగర్ కర్నూల్ పోలీసులు కేసు కూడా నమో దుచేశారు. కేసరిసముద్రం చెరువును అనుసరించి భూములను కొని ఏకంగా చెరువుల శిఖాన్ని దొబ్బాలని చూశారనే విమర్శలు ఉన్నాయి. వీరి ఆశలను కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీటితో నింపడంతో అడియాసలు చేశాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. చెరువులు నిడటంతో వీరు చేసిన ప్లాట్లు నీట మునగడంతో బండారం బయట పడింది. నాగర్ కర్నూల్ లోని కేసరి సముద్రం చెరువు బఫర్ జోన్ లో వీరి వ్యాపారంలోని భాగస్తులు అక్రమంగా నిర్మాణాలు చేయడంతో కొందరు గ్రీన్ ట్రీబ్యు నల్ ను ఆశ్రయించిన విషయం విదితమే. ఇదిలాఉండగా ఇప్పటికీ వీరిలో మార్పు రాలేదు. చెరువుల చుట్టూ భూములను తక్కువ ధరకు కొని చెరువులను అనుసరించి ఉన్న ప్రభుత్వ భూములను చెరబట్టి సొమ్ము చేసుకోవడమే వీరి పనిగా ప్రజలు చర్చించుకుంటున్నారు.

కందనూలు టు జడ్చర్ల
నాగర్ కర్నూల్ లో వీరి తతంగం ఇలా ఉండగా, జడ్చర్లలో వీరికి సంబంధించిన భూమిలో భారీ విద్యుత్ టవర్లను ఏర్పాటుచేశారు.. పనులు జరుగుతున్న క్రమంలో ఇరువురు అన్నదమ్ములు పనులను అడ్డుకోవడానికి చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో వీరి ఆగ్రహం కట్టలు తెంచుకొని అధికార పార్టీలో తమ్ముడు కొనసాగుతుండగానే అన్న మాత్రం తాము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వం గా భావించామని… అధికారులేమో రజాకార్లుగా వ్యవహరిస్తున్నారని కొన్ని ఛానల్స్ ముందు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకచోట ప్రభుత్వ భూములు, ప్రైవేట్ వ్యక్తుల భూములను నయానో.. భయానో సొంతం చేసుకుంటూ.. మరో పక్క తమ భూమిలో ప్రభుత్వం విద్యుత్ టవర్లను ఏర్పాటుచేస్తే సహించకపోగా అధికార పార్టీలో కొనసాగుతున్నా… అదే ప్రభుత్వాన్ని రజాకారుల ప్రభుత్వంగా అభివర్ణించడమే చర్చనీయాంశంగా మారింది… ఇలాంటి వ్యక్తులకు పార్టీలంటే పైపైన అభిమానం మాత్రమేనని, వారికి డబ్బు సంపాదనే ముఖ్యమని, సమాజంలో విలువలు పట్టవని ఈ వీడియోలు చూసిన వారు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. ఇలాంటి స్వార్థపరుల పట్ల పార్టీలు… ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలాఉండగా భూ కబ్జాకోరులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందా…? లేదా అనేది పార్టీ వీరిపై తీసుకునే చర్యల మీదే ఆధారపడి ఉంటుంది అని ప్రజల్లో చర్చ సాగుతోంది.