Breaking News

గ్రీన్​ సిటీగా హైదరాబాద్​

గ్రీన్ సిటీగా హైదరాబాద్
  • నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం
  • స్వచ్ఛతపై ప్రత్యేకశ్రద్ధ
  • ఆటోలను ప్రారంభించిన కేటీఆర్​

సామాజిక సారథి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మార్చడానికి అందరూ కృషిచేయాలని, హైదరాబాద్‌ నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తున్నామని మంత్రి కె.తారక రామారావు  స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ వెల్ఫేర్‌ గ్రౌండ్‌లో మంత్రి తలసానితో కలిసి సోమవారం స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఐదారేళ్లుగా కేంద్రం ప్రకటించే స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకింగ్స్‌లో బెస్ట్‌ నగరంగా హైదరాబాద్‌ నిలుస్తూ వస్తుందన్నారు.  నగరంలో 2500 ఆటో టిప్పర్లు ప్రవేశపెట్టకముందు 3,500 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేదని, ఈ ఆటో టిప్పర్లు ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడం వల్ల.. 6,500 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని తెలిపారు. మొత్తంగా చెత్తను డంప్‌ యార్డులకు తరలిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛతలో హైదరాబాద్‌ నగరం ముందు ఉన్నదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.  స్వచ్ఛతలో హైదరాబాద్‌కు ఎన్నో అవార్డులు వచ్చాయని చెప్పారు. నగరంలో పార్కులు, రోడ్లు, బస్‌ షెల్టర్లు సుందరంగా మారాయన్నారు. నగరవాసులు స్వచ్ఛ ఆటోలను ఉపయోగించుకోవాలని సూచించారు. చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.