Breaking News

యువకుడిని బలితీసుకున్న కరోనా

యువకుడిని బలితీసుకున్న కరోనా

సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ యువకులను ఎక్కువగా బలి తీసుకుంటోంది. తాజాగా కరీంనగర్​జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన నీలం రాజు (34) అనే యువకుడు కరోనాతో మృతిచెందాడు. కొద్దిరోజులుగా కరోనాతో పోరాడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు. మృతుడికి అమ్మ నాన్న, తమ్ముడు, చెల్లి ఉన్నారు. తాను పెళ్లి చేసుకోకుండా కుటుంబభారాన్ని మోస్తున్నాడు. తమ కొడుకు లేడన్న నిజాన్ని తెలుసుకుని రాజు తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తుండగా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టారు.

నీలం రాజు మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో ఆప్యాయంగా ఉండే రాజు ఇకలేడన్న నిజాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తమ సొంత వ్యవసాయ పొలంలో రాజు దహన సంస్కరాలు నిర్వహించారు. ఆత్మీయత ఆనురాగాలకు మారుపేరైన నీలం రాజు పవిత్రఆత్మకు శాంతి చేకూరాలని గ్రామస్తులు నివాళులర్పించారు.

బాల్యమిత్రుల అంతిమ సంస్కారాలు
కరోనా భయంతో రాజు మృతదేహాన్ని చూసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మానవతా దృక్పథంలో రంజాన్ ఉపవాసదీక్షలో ఉన్న తన చిన్ననాటి బాల్యమిత్రుడు స్టార్ యూత్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అహ్మద్, మాజీ వార్డు సభ్యుడు ఆరిఫ్ అన్నీ తామై మృతుడి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఇద్దరు మిత్రులను గ్రామస్తులు, మృతుడి బంధువులు అభినందించారు.