- మహాశివరాత్రికి ఏర్పాట్లు
- 5లక్షల మందిపైగా భక్తులు వచ్చే అవకాశం
- దేవాలయం ఏర్పాట్లు చేస్తున్న పాలకవర్గం
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడ శివాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. అందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా శివాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు, వైద్య, సౌకర్యాలు ఏర్పాటు చేస్తుండడంతో పాటు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తులకు పండ్లు కూడా పంపిణీ చేయనున్నారు. మహాశివరాత్రి పండుగకు భక్తుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారీ క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు బీరంగూడ కొండపైకి వెళ్లే భక్తులకు రోడ్డుమార్గం పనులను పూర్తిచేస్తున్నారు. వాహనాలు కావాల్సిన పార్కింగ్ స్థలాలను ఇప్పటికే పూర్తిచేశారు.
28 నుంచి ఉత్సవాలు
బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం ఆరో శతాబ్దంలో వెలిసిందని చెబుతుంటారు. ఈనెల 28 నుంచి మార్చి 4తేదీ వరకు జరిగే ఉత్సవాల కోసం ఆలయాన్ని చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు. బీరంగూడ దేవస్థానం ఎంతో అనువైన క్షేత్రంగా ప్రసిద్ధి గాంచింది. మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, పటాన్‌చెరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు రాకపోకలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు ఐదులక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని నిర్వాహకులు తెలిపారు.
- గుట్టపైన జరిగే కార్యక్రమాలివే..
- 28న ఆలయ ప్రదక్షిణ గణపతి పూజ నవగ్రహ దారణ పూర్వక అభిషేకం, అమ్మవారి సహస్ర కుంకుమార్చన నిర్వహిస్తారు.
- 1వ తేదీన మంగళవారం మహాశివరాత్రి లింగోద్భవ అభిషేకం, తెల్లవారుజామున రెండు గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మహామండపం నుంచి ప్రత్యేక అభిషేకాలు, నవగ్రహ హనుమాన్ పూజ అమ్మవారి ప్రత్యేక అలంకరణ ఉంటాయి.
- 2న బుధవారం రుద్రాభిషేకం ఉదయం 10:45గంటలకు, భ్రమరాంబ మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.
- 3న వసంతోత్సవం బ్రహ్మఅలంకరణ పల్లకీసేవ
- 4న పంచామృత అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన హోమం పవళింపు సేవ ఉంటాయి.
- బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులు సౌకర్యాల కోసం సీసీఫుటేజీలో పోలీసు అధికారులతో భారీబందోస్తు ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం చైర్మన్ ఏనుగు తులసీరెడ్డి, దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి శశిధర్ తెలిపారు.