Breaking News

సూర్యాపేట హైరానా

సూర్యాపేట హైరానా

  • 83 మందికి కరోనా పాజిటివ్
  • పల్లెలకు పాకిన మహమ్మారి
  • పరిస్థితిని పరిశీలించిన సీఎస్, డీజీపీ
సూర్యాపేట పట్టణ చౌరస్తా
సూర్యాపేట పట్టణ వ్యూ

సారథి న్యూస్​, నల్లగొండ: పట్టణాలకే పరిమితమైందనుకున్న కరోనా మహమ్మారి జిల్లా ప్రాంతాలు, క్రమంగా గ్రామాలకూ పాకుతోంది. తాజాగా సూర్యాపేట ఉదంతమే దీనికి నిదర్శనం. ఈ నెల 2వ తేదీన మొదటి కరోనా పాజిటివ్​ కేసు నమోదుకాగా, కేవలం 20 రోజుల్లోనే.. బుధవారం నాటికి 83 కేసులకు చేరింది. ఢిల్లీ మర్కజ్​కు వెళ్లొచ్చిన ఓ వ్యక్తి నుంచి జిల్లాలో ఇంత పెద్దసంఖ్యలో పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. సదరు వ్యక్తి ద్వారా తన కుటుంబ సభ్యులకు, ఓ మెడికల్​ షాపులో మెడిసిన్​ కొని షాపు సిబ్బందికి కరోనా మహమ్మారిని అంటించాడు. స్థానికంగా చేపలు విక్రయించే ఓ మహిళ ఆ మెడికల్ షాపు నుంచి మందులు కొనుగోలుచేయగా ఆమెకూ అంటుకుంది. ఆమె నుంచి మార్కెట్​లో కిరాణషాపు నిర్వాహకుడు, అక్కడి నుంచి మరికొంత మందికి వైరస్​ సోకింది. ఇలా ఈ కాంటాక్ట్​ను ఛేదించడం ఇప్పుడు అధికార యంత్రాంగానికి పెద్ద సవాల్​గా మారింది. చాలా రోజులు చిక్కుముడిగా ఉన్న

ఈ కాంటాక్ట్ ట్రేసింగ్‌ను చివరకు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా అధికారులు గుర్తించారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారికి కాంటాక్ట్‌లో ఉన్న వారు సుమారు ఐదువేల మంది వరకు ఉన్నట్టు అంచనా.. ఇలా ఎంత ప్రమాదకరస్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా గుర్తించిన 4,346 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. మరో 210 మందిని ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ సెంటర్​లో ఉంచారు. 796 నమూనాలను సేకరించగా 83 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 191 పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ప్రమాదకర స్థాయిలో కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం సూర్యాపేటపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సూర్యాపేట మున్సిపాలిటీకి కరోనా ప్రత్యేకాధికారిగా వేణుగోపాల్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. కరోనా వైరస్ వ్యాప్తిచెందిన మెడికల్ షాపులో ఎవరెవరు మందులు కొన్నారనే వివరాలు సేకరిస్తున్నారు. కేవలం మార్కెట్ ప్రాంతంలోనే 40 మందికి కరోనా రావడంతో  ఈ ఇక్కడికి వచ్చే నాలుగు మండలాల్లోని సుమారు 40 గ్రామాల్లో ఇంటింటికీ సర్వే నిర్వహిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు  సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రత్యేక హెలిక్యాప్టర్​ లో సూర్యాపేటకు వచ్చారు. కరోనా వైరస్‌ విజృంభణకు కారణమైన మార్కెట్‌ బజార్‌ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్‌.భాస్కరన్, జిల్లా అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు.

‘పేట’లో 54 పాజిటివ్‌ కేసులు

జిల్లా వ్యాప్తంగా 83 పాజిటివ్‌ కేసులు నమోదైతే ఇందులో సూర్యాపేట పట్టణంలోనే 54 పాజిటివ్‌ కేసులున్నాయి. కుడకుడ, ఓ మెడికల్‌ దుకాణంలోని వ్యక్తులు మినహా మిగతా పాజిటివ్‌ కేసులన్నీ మార్కెట్‌బజార్‌ నుంచి విస్తరించినవే. పట్టణంలో కుడకుడ, భగత్‌సింగ్‌ నగర్, మార్కెట్‌ బజార్‌తో పాటు చర్చిం కంపౌండ్, అంబేద్కర్‌ నగర్, కోటమైసమ్మ బజార్‌లో ఉన్న అనుమానిత వ్యక్తులకు పరీక్షల్లో కరోనా ఉన్నట్లు తేలింది. మార్కెట్‌ బజార్‌ నుంచి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల ద్వారా వీరికి వైరస్‌ వచ్చింది.

  పల్లెకు పాకిన వైరస్‌

సూర్యాపేట పట్టణం నుంచి వైరస్‌ పల్లెలకు పాకింది. మార్కెట్‌ బజార్‌నుంచి వర్ధమానుకోట గ్రామంలో ఆరు, అనంతారంలో ఒకటి, పోల్‌మల్లలో ఒకటి, ఏపూరులో 14 పాజిటివ్‌ కేసులు బయట పడ్డాయి. పల్లెల్లో వీరి కాంటాక్టులకు సంబంధించిన వారినంతా ప్రభుత్వ క్వారంటైన్‌లో పెట్టి శాంపిల్స్‌ పరీక్ష కోసం హైదారాబాద్‌కు పంపారు. ఏపూర్‌ గ్రామంలోనే 14 పాజిటివ్‌ కేసులు రావడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటు జీవనం సాగిస్తున్నారు.  ఈ గ్రామానికి చెందిన వ్యక్తి మార్కెట్‌ బజార్‌కు వెళ్లి సరుకులు కొనుగోలు చేసుకొని ఇంటికి వెళ్లాడు. ఈ వ్యక్తి కుటుంబంలో అందరికీ నెగిటివ్‌ వచ్చి ఆరేళ్ల వయసున్న అతని కుమారుడికి పాజిటివ్‌ వచ్చింది. ఈ బాలుడి ఇంటి పక్కనే ఉన్న ఒకే కుటుంబంలోని ఏడుగురికి అలాగే వీరి నుంచి పక్కనే ఉన్న  బంధువుల కుటుంబంలోని మరో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. బాలుడి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులతో వైరస్‌ 13 మంది వ్యక్తులకు సోకింది.