Breaking News

సింగూరు కరువు తీరింది

సింగూరు కరువు తీరింది

సారథి న్యూస్, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏకైక భారీ ప్రాజెక్టు సింగూరు రెండేళ్ల తర్వాత జలకళ సంతరించుకుంది. 29 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు వర్షాభావ పరిస్థితుల కారణంగా రెండేళ్లుగా వెలవెలబోయింది. 2018లో ప్రాజెక్టులో 18 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు 16 టీఎంసీల నీటిని తరలించింది. దీంతో సంగారెడ్డి, మెదక్ జిల్లాలో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సింగూరులో నీళ్లు లేక కాల్వల కింద 40వేల ఎకరాలు, ఘనపూర్ ఆనకట్ట ఆయకట్టు పరిధిలో 22వేల ఎకరాల సాగుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మంజీరా నది, సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో తాగునీటి పథకాలు సైతం వెలవెలబోయాయి.

ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతంలో భారీవర్షాలు కురవడంతో మంజీరా నదికి వరద ఉధృతి పెరిగింది. శనివారం ప్రాజెక్టులో 16 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఎగువ నుంచి వరద వస్తుండడంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నీటి పారుదలశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టులోకి ఆశించిన దగ్గ నీళ్లు చేరడంతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో యాసంగి పంటల సాగుకు దిగులు తీరింది. రెండు జిల్లాల పరిధిలో 60వేల ఎకరాల్లో సాగుచేసుకునేందుకు వీలు కలిగింది. అంతేకాకుండా సింగూరు నిండి మంజీరా నదిలో కలుస్తుండడంతో తాగునీటి పథకాలకు సైతం ఇబ్బంది లేకుండా అయింది.