Breaking News

వారం పదిరోజుల్లో రైతుబంధు

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి దాని ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధమయ్యారని సీఎం కె.చంద్రశేఖర్​రావు సంతోషం వ్యక్తంచేశారు. ఒక్క ఎకరా మిగలకుండా అందరికీ వారం పదిరోజుల్లో రైతుబంధు సొమ్మును బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని సీఎం ఆదేశించారు. సోమవారం అధికారులతో ఆయన సమీక్షించారు. మార్కెట్లో డిమాండ్ కలిగిన వంటలను వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ప్రతిపాదించిందని చెప్పారు. రాష్ట్రమంతా నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమవడంతో రైతులందరికీ రైతుబంధు సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయని, రైతు పెట్టుబడి కోసం ఇబ్బంది పడొద్దని అన్నారు. వర్షాకాలం పంటల కోసం ప్రణాళిక రూపొందించినట్లుగానే యాసంగి వ్యవసాయ ప్రణాళికను తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.