Breaking News

ముసురే ముంచింది..

ముసురే ముంచింది..


  • ముసురు వానకు పెసర పంటకు తీవ్ర నష్టం
  • ‘ఖేడ్’ డివిజన్ లో 12,446 ఎకరాల్లో సాగు
  • 9,541 ఎకరాల్లో నష్టపోయినట్లు గుర్తించిన అధికారులు

సారథి న్యూస్​, కంగ్టి(సంగారెడ్డి): పదిహేను రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన ముసురు వానలకు నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో పెసర పంట ఆగమైంది. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నిరుడు కంటే ఈ యేడు పెసర కాయ బాగా కాయడంతో సంతోషించిన రైతులు పంట నీటిపాలు కావడంతో ఆవేదన చెందుతున్నారు. పొలంలో జాలువారిన నీటిలో పంటంతా తేలుతోంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని నారాయణఖేడ్, మనూర్, నాగుల్ గిద్ద, కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లోని 6,858 మంది రైతులు 12,446 ఎకరాల్లో పెసర పంటను సాగు చేశారు. ఇటీవల కురిసిన ముసురు వానలకు 9,541ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. అంటే 76.3శాతం మేర పంటనష్టం వాటిల్లింది. అత్యధికంగా మనూర్ మండలంలో పంటనష్టం వాటిల్లింది. అత్యల్పంగా నారాయణఖేడ్ మండలంలో నష్టం జరిగింది. మండలాల వారీగా పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. నష్టపోయిన రైతులు దిగులు చెందకూడదని సూచిస్తున్నారు.
మండలాల వారీగా పంట వివరాలు
కంగ్టి 6,441, నాగుల్ గిద్ద 5,137, నారాయణఖేడ్ 4,508, మనూర్ 4,170, కల్హేర్ 3,245 ఎకరాల్లో పెసరు పంటను వేశారు. పంట నష్టపోయిన వివరాలను పరిశీలిస్తే.. మనూర్ 2,750 ఎకరాలు, నాగుల్ గిద్ద 2,750 ఎకరాలు, కంగ్టి 1,457 ఎకరాలు, కల్హేర్ 1,200 ఎకరాలు, సిర్గాపూర్ 950 ఎకరాలు, నారాయణ ఖేడ్ 688 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు గుర్తించారు.

నివేదిక పంపించాం..

నారాయణఖేడ్ డివిజన్ లోని వివిధ మండలాల్లో రైతులు పండించిన పెసరు పంట చేతికొచ్చిన సమయంలో వానలకు తీవ్రస్థాయిలో రైతులకు పంటనష్టం వాటిల్లింది. మండలాల వారీగా ఆఫీసర్లు సర్వేచేసి పంటనష్టంపై నివేదిక తయారు చేశాం. రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం.
:: కరుణాకర్ రెడ్డి, ఏడీఏ


సర్కారు ఆదుకోవాలి
రెండు ఎకరాల్లో పెసర పంటను సాగుచేశాం. కాయ బాగానే ఉందని ఆనందపడ్డం. అధిక లాభం వస్తుందని ఆశించినా నిరాశే మిగిలింది. ముసురు వానలకు పంట మొత్తం నీటిలో మునిగిపోయింది. పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని దిగులుగా ఉంది. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
:: మేత్రి నాగ్ గొండ, చాప్టా(కే)కంగ్టి మండలం, సంగారెడ్డి జిల్లా