Breaking News

భూ నిర్వాసితులు అధైర్యపడొద్దు


సారథి న్యూస్, హుస్నాబాద్​: గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు అధైర్యపడొద్దని భారీ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కోరారు. శుక్రవారం గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించి అనంతరం ఎమ్మెల్యే సతీశ్ కుమార్, ఆఫీసర్స్ తో ఏర్పాటుచేసిన రివ్యూ మీటింగ్ లో మాట్లాడారు. భూ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఉందన్నారు. ప్రాజెక్టు కింద 250 ఎకరాల భూసేకరణ మిగిలి ఉందని దానిపై కలెక్టర్లతో సమావేశం నిర్వహించి నిర్వాసితులకు త్వరలోనే డబ్బులు తమ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తామన్నారు. ప్రాజెక్టు ఇప్పటికే 85 శాతం పూర్తయిందని, మిగతా 15 శాతం పనులు అక్టోబర్ చివరి నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి గోదావరి జలాలతో నింపాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సెక్రటరీ వెల్లడించారు. ప్రాజెక్టు కింద ఉన్న రెండొందల ఎకరాల చెరువులు, కుంటల్లో నీళ్లు నింపుతామన్నారు.
భూ నిర్వాసితులను ఆదుకోవాలి
గౌరవెల్లి ప్రాజెక్టు డిజైన్ చేసిన తర్వాత ముంపునకు గురవుతున్న సర్వేనం.555, 128, 111లో ప్రభుత్వం దళితులు(ఎస్సీ)లకు ఇచ్చిన భూములపై బినామీలు నష్టపరిహారాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు. నష్టపరిహారం ఇవ్వాలని ఆరేళ్లుగా తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదని ఉప సర్పంచ్​ కొమ్ముల భాస్కర్, భూ నిర్వాసితులు సెక్రటరీ రజత్ కుమార్ ను కోరారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల కింద నిర్వాసితులకు డబ్బులు చెల్లించిన మాదిరిగానే గౌరవెల్లి భూ నిర్వాసితులకు ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.