Breaking News

బౌలర్లకు రెండు నెలలు పట్టొచ్చు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్

ముంబై: బౌలర్లు పూర్తి స్థాయిలో టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టాలంటే కనీసం రెండు నెలల ప్రాక్టీస్ అవసరమని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్లడించింది. గాయాల బారినపడకుండా ఉండాలంటే ఇది కచ్చితంగా అవసరమని చెప్పింది. ‘లాక్​ డౌన్​ కారణంగా బౌలర్లంతా ఇంటికే పరిమితమయ్యారు. కనీసం రన్నింగ్ ప్రాక్టీస్ కూడా లేదు. ఇప్పటికిప్పుడు టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టాలంటే వాళ్లకు పెద్ద రిస్క్ ఉంటుంది. గాయాల బారినపడతారు. అందుకే ముందు చిన్నచిన్న కసరత్తులు మొదలుపెట్టి పూర్తిస్థాయి రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాతే పూర్తిస్థాయి బౌలింగ్ చేయగలుగుతారు.

కనిష్టంగా 8 నుంచి 14 వారాల సమయం పడుతుంది. ఇందులో చివరి రెండు మూడు వారాలు మ్యాచ్​కు అవసరమైన తీవ్రతో బౌలింగ్ చేయగలుగుతారు’ అని ఐసీసీ పేర్కొంది. బౌలర్లపై వర్క్​లోడ్ తగ్గించేందుకు ఎక్కువ మొత్తంలో ప్లేయర్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పింది. పరిమిత ఓవర్ల క్రికెట్​లో ఆడేందుకు కనీసం ఆరువారాల ప్రాక్టీస్ అవసరమని తెలిపింది. ప్రతి జట్టు మెడికల్ నిపుణుడిని పెట్టుకోవడం ద్వారా బౌలర్లు సురక్షితంగా ట్రైనింగ్​ మొదలుపెట్టే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.