Breaking News

బీజేపీ సారథిగా బండి సంజయ్​

బీజేపీ సారథిగా బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర కాషాయదళానికి కొత్త చీఫ్ గా ఎన్నికైన …

తెలంగాణ రాష్ట్ర కాషాయదళానికి కొత్త చీఫ్ గా ఎన్నికైన క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ టార్గెట్ ఫిక్స్ అయ్యిందా..? కుర్చీలో మూడేళ్ల పాటు ఉండే సంజ‌య్ ఏజెండా ఏమిటి..? తెలంగాణ‌లో అంతంత మాత్రంగానే ఉన్న పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాల‌నే అంశంపై సంజ‌య్ చాలా క్లారిటీతో ఉన్నట్లు ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ ఆఫీసు వ‌ద్ద ఏర్పాటుచేసిన అభినంద‌న స‌భ వేదిక‌గా స్పష్టమైన సంకేతాలు పంపిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

హిందుత్వమే ఏజెండా

బీజేపీ ప్రధాన బలమైన హిందూవ‌ర్గాలను మ‌రింత సంఘ‌టితం చేయాల‌ని సంజ‌య్ ప్రధాన ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆయ‌న నోటి వెంట ప‌దే ప‌దే వ‌చ్చే మాట‌లు కూడా ఆ దిశ‌గానే అడుగులు వేస్తున్నాయి. పార్టీ మూల సిద్ధాంతమైన జాతీయవాదం, దేశభక్తి, హిందూ విధానాన్ని ముందుకు తీసుకెళ్తానని సంజ‌య్ స్పష్టం చేశారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్వహించిన మొట్ట మొద‌టి అభినందన సభ వేదిక మీదనే భైంసా అంశాన్ని ప్రస్తావించారు. అక్కడ అల్లర్లలో నష్టపోయిన హిందువులను ఆదుకోవడం కోసం సభా వేధిక మీద హుండీ ఏర్పాటుచేశారు. తనకు పూలమాలలు, బొకేలు, శాలువాలు వద్దంటూ… భైంసా బాధితులకు అండగా నిలుద్దామని ముందుగానే పిలుపునిచ్చారు. అభిమానులు అందించే విరాళాలను త్వరలో భైంసాలో పర్యటించి నష్టపోయిన హిందువులకు అంద‌జేస్తాన‌ని హామీ ఇచ్చారు. 

సీఏఏ, ఎన్పీఆర్‌లే అస్త్రాలు 

ఇటీవ‌లి కాలంలో కేంద్రం తీసుకొచ్చిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం విష‌యంలో దేశవ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్యక్తమవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల్లో సీఏఏను వ్యతిరేకిస్తూ.. అసెంబ్లీలో తీర్మానాలు సైతం చేశారు. అందులో భాగంగా తెలంగాణ శాస‌న‌స‌భ కూడా సీఏఏను వెన‌క్కి తీసుకోవాల‌ని ఏక‌గ్రీవ తీర్మానం చేసింది. దీనిపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఏఏ వ‌ల్ల ఏ ఒక్కరి పౌర‌స‌త్వం తొల‌గించ‌డం లేద‌ని.. ఈ విష‌యంలో బీజేపీ స‌ద‌స్సులు, చైత‌న్య వేదిక‌లు సైతం చేప‌ట్టింది. ఇక నుంచి తెలంగాణ‌లో మ‌రింత దూకుడుగా వ్యహరించాలని బీజేపీ యోచిస్తోంది. టీఆర్‌ఎస్.. కేవ‌లం మ‌జ్లిస్ మెప్పుకోసమే సీఏఏను వ్యతిరేకిస్తుందంటూ మాట‌ల దాడి చేస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట నిర్వహించాలని సంజ‌య్ భావిస్తున్నారు. దీని ద్వారా హిందువుల‌ను సంఘ‌టితం చేసే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని యోచిస్తోంది. 

టీఆర్‌‌ఎస్‌‌కు దీటుగా 

తెలంగాణలో ప్రస్తుత ప‌రిస్థితిలో టీఆర్‌ఎస్ కు ఎదురే లేకుండాపోయింది. రాష్ట్ర రాజ‌కీయాల్లో వార్ వ‌న్ సైడ్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో అధికారపార్టీకి, సీఎం కేసీఆర్ కు గట్టి కౌంట‌ర్లు ఇవ్వాల‌ని డిసైడ‌య్యారు. ఇప్పటివరకు చాలా చప్పగా సాగిన రాజ‌కీయాల‌ను ర‌క్తి క‌ట్టించాల‌ని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా అధ్యక్షుడిగా మొట్ట మొద‌టిసారిగా నిర్వహించిన స‌మావేశంలోనే ఆ దిశ‌గా అడుగులు వేశారు. సీఎం కేసీఆర్ పై ప‌దునైన విమ‌ర్శలు చేశారు.  అంతేకాదు కేసీఆర్ కు తాను భ‌య‌ప‌డే వ్యక్తిని కాదని.. ధీటుగా నిల‌బ‌డ‌తాన‌ని చెప్పారు. ఇక నుంచి కేసీఆర్ పై యుద్ధమే చేస్తానని.. కౌంట్ డౌన్ ను కూడా ప్రారంభించారు. ఆఖరికి తన ప్రాణం పోయినా ఫర్వాలేదని.. గోల్కొండ కోట మీద బీజేపీ జెండా ఎగరవేస్తానని శపథం చేశాడీ కొత్త దళపతి. అలాగే పార్టీని కూడా మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని కొత్త బాస్ ఆలోచ‌న చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర, రథయాత్ర చేయాల‌ని నిర్ణయించారు. ప్రతి మండ‌లానికి, ప్రతి గ్రామానికి వెళ్లి కార్యకర్తలను కలుసుకునే కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఏ ర‌కంగా చూసినా బండి సంజయ్‌‌టార్గెట్ చాలా క్లారిటీగా ఉన్నట్లు రాజకీయవర్గాలు చెబుతున్నాయి. 

– జీపీ రెడ్డి