Breaking News

బతికుండగానే బావిలోకి..!

  • గొర్రెకుంట మృతుల పోస్టుమార్టం రిపోర్టు
  • కాల్​ డేటా ఆధారంగా విచారణ వేగవంతం
  • 9మంది మృతిపై ఎన్నో అనుమానాలు

సారథి న్యూస్​, వరంగల్: వరంగల్​ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో బయటపడ్డ 9 మృతదేహాలకు శనివారం పోస్టు‌మార్టం పూర్తయింది. ప్రాణం ఉండగానే నీటిలో పడి చనిపోయినట్టు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. విషప్రయోగమా? మత్తు మందు ఇచ్చారా? అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులు షకీల్, యాకూబ్ ఫోన్స్​ కీలకం కానున్నాయి. కాల్ డేటా ఆధారంగా వివరాలను పోలీసులు ఆరాతీస్తున్నారు. మక్సూద్ కూతురు బూస్రాకు ఉన్న వివాహేతర సంబంధాలపై కూపీ లాగుతున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాలతో వరంగల్​ సీపీ డాక్టర్​ రవిందర్​ సమావేశమయ్యారు.

సెల్​ ఫోన్లే కీలకం
మిస్టరీని ఛేదించేందుకు అన్నికోణాల్లో విచారణ వేగవంతం చేశారు. ఈ ఘటనలో మహ్మద్ మక్సూద్ ఆలంకు సన్నిహితుడైన డ్రైవర్ షకీల్ అహ్మద్ కు మక్సూద్​ కూతురు బుస్రా ఖాతూన్‌తో‌‌ వివాహేతర సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దుర్ఘటనలో షకీల్ సెల్‌ఫోన్‌పై దృష్టి సారించిన పోలీసులు కాల్ డేటాను సేకరిస్తున్నారు. బుస్రా ఖాతూన్ ప్రియుడిగా అనుమానిస్తున్న మిద్దెపాక యాకూబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్‌కే చెందిన దర్భంగా జిల్లా కేవిట్ తాలూకా సిసోనా వాసి సంజయ్ కుమార్ యాదవ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గొర్రెకుంట ఘటనలో మృతిచెందిన 9 మందిలో ఏడుగురి సెల్‌ఫోన్ల ఆచూకీపై టెన్షన్ నెలకొంది. మృతుల ఫోన్ నంబర్లను పోలీసులు ప్రకటించారు. మృతదేహాలను వెలికితీసిన తర్వాత సెల్‌ఫోన్ల కోసం బావి నుంచి నీరంతా తోడినా ఆధారాలు లభించలేదు. మిస్టరీగా మారిన ఈ ఘటనలో సెల్ ఫోన్లే కీలకం కానున్నాయి. ఆ దిశగా పోలీసుల విచారణ కొనసాగుతోంది.