Breaking News

నేను దుబే.. కాన్పూర్‌‌ వాలా

ఉజ్జయిని: 60 కేసుల్లో నిందితుడైన వికాస్‌ దుబేను పోలీసులు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయం బయట అరెస్టు చేశారు. అయితే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా.. వికాస్‌ దుబే పెద్ద పెద్దగా కేకలు వేశాడు. ‘నేను వికాస్‌ దుబేను.. కాన్పూర్‌‌ వాలాను’ అంటూ పోలీసుల ముందు అరిచాడు. వికాస్‌ను పోలీసులు కారులోకి ఎక్కిస్తుండగా అతడు కేకలు వేసిన వీడియోలు బయటికి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయంలో దగ్గర ఒక షాప్‌లో పూజ సామగ్రి కొన్న దుబేను ఆ షాప్‌ వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. వారం రోజుల పాటు 40 టీమ్‌లు దుబే కోసం గాలించాయి.
యూపీ పోలీసులకు అప్పగిస్తాం: శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌
వికాస్‌ దుబే అరెస్టుపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. ఉజ్జయిని మహంకాళీ అతడిని కాపాడుతుందని అనుకోవడం భ్రమా అని, అలా ఎప్పుడూ జరగదన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌, యూపీ పోలీసులను చౌహాన్‌ మెచ్చుకున్నారు. ‘దుబేను అరెస్టు చేసిన ఎంపీ పోలీసులను అభినందిస్తున్నాను. యూపీ పోలీసులతో కాంటాక్ట్‌లో ఉన్నాం. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కూడా మాట్లాడాను. ఫార్మాలిటీస్‌ పూర్తైన తర్వాత దుబేను యూపీ పోలీసులకు హ్యాండవర్‌‌ చేస్తాం” అని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ట్వీట్‌ చేశారు. ఉజ్జయిని.. దుబే అత్తగారి ఊరు అని, ఏటా మహంకాళి దర్శనానికి వెళ్తాడని దుబే తల్లి సరళాదేవి అన్నారు. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోవాలని ఆమె అన్నారు.