Breaking News

నిమ్మగడ్డ వ్యాజ్యంపై 28న విచారణ

ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు

సారథి న్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మాజీ కమిషనర్‌ పదవీ కాలాన్ని అయిదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేసిన వ్యాజ్యంపై ఈ నెల 28న తుది విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది. కమిషనర్‌ పదవి నుంచి తనను కావాలని తప్పించారని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్డినెన్స్‌ అందుకు అనుగుణంగా జారీ అయిన జీవోలను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ, టీడీపీ నేతలు కామినేని శ్రీనివాస్, వర్ల రామయ్య, ఏపీ కాంగ్రెస్‌ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌ వలి, వడ్డే శోభనాద్రీశ్వరరావు, న్యాయవాదులు ఇతరులు వేర్వేరుగా  14 వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది.

అన్ని రిట్లల్లోనూ ప్రభుత్వ వాదనలతో 24తేదీలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని, కొత్తగా నియమితులైన కమిషనర్‌ వి.కనగరాజ్‌ కూడా అదే తేదీ నాటికి కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని, ప్రభుత్వ కౌంటర్‌పై పిటిషనర్లు రిప్లై కౌంటర్లను 27వ తేదీ నాటికి దాఖలు చేయాలని, 28వ తేదీ మంగళవారం తాము తుది విచారణ జరుపుతామని డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది. నిమ్మగడ్డ తరఫు సీనియర్‌ లాయర్‌ డీవీ సీతారామమూర్తి వాదిస్తూ, ఇప్పుడు హైకోర్టు వాదనలు వినాలన్నారు. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలుకు సమయం కోరడం తగదన్నారు. కొత్తగా కమిషనర్‌గా నియమితులైన కనగరాజ్‌ ఏవిధమైన నిర్ణయాలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. దీనిపై హైకోర్టు కల్పించుకుని కరోనా లాక్‌డౌన్‌ మే 3 వరకూ ఉందని, ఈ పరిస్థితుల్లో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని వ్యాఖ్యానించింది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయని, ఈ పరిస్థితుల్లో ఎస్‌ఈసీ ఏ చర్యలు తీసుకునే అవకాశాలు లేవని పేర్కొంది. తొలుత అడ్వకేట్‌ జనరల్‌ సుబ్రహ్మణ్య శ్రీరామ్‌ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ.. పలు రిట్లు పడ్డాయని, తొలుత హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా రిట్లు దాఖలయ్యాయని, అందుకే ప్రభుత్వం ప్రాథమిక కౌంటర్లను మాత్రమే దాఖలు చేసిందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందుకు వారం రోజుల సమయం కావాలన్నారు. ఎస్‌ఈసీ కమిషనర్‌ కనగరాజ్‌ తరఫు సీనియర్‌ లాయర్‌ ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వాదిస్తూ.. కొన్ని రిట్లు మాత్రమే తమకు అందాయని, అన్ని రిట్లు అందలేదని, కౌంటర్‌ పిటిషన్ల దాఖలుకు మూడు వారాల సమయం కావాలన్నారు. ఇందుకు అనుమతించని హైకోర్టు 24వ తేదీలోగా ప్రభుత్వం, ఎస్‌ఈసీ కమిషనర్లు కౌంటర్, 27 నాటికి పిటిషనర్లు రిప్లై కౌంటర్లు వేసేందుకు గడువు ఇచ్చి తుది విచారణను 28కి వాయిదా వేసింది.