Breaking News

దిమిత్రోవ్, కొరిచ్​కు కరోనా

క్రొయేషియా: టెన్నిస్ క్రీడలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. గత వారం నిర్వహించిన ఏడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీలో పాల్గొన్న గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా), బోర్నా కొరిచ్ (క్రొయేషియా)లకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ టోర్నీలో ఆడిన ప్లేయర్లకు వైరస్ భయం పట్టుకుంది. అలాగే మ్యాచ్​కు హాజరైన నాలుగు వేల మంది ప్రేక్షకుల్లో కూడా ఆందోళన మొదలైంది. ప్రపంచ నంబర్​వన్​ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ ఈ టోర్నీని ఏర్పాటు చేయడంతో అతనిపై విమర్శలు మొదలయ్యాయి. తొలి మ్యాచ్​లో జొకోవిచ్​తో కలిసి డబుల్స్ ఆడిన దిమిత్రోవ్.. సెకండ్ లెగ్ మ్యాచ్ తర్వాత జ్వరంతో బాధపడ్డాడు. దీంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్​ గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన దిమిత్రోవ్.. తనతో టచ్​లో ఉన్న వారందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరాడు. దీంతో జొకోవిచ్​లో భయం రెట్టింపైంది. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న దిమిత్రోవ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. కరోనా భయంతో జొకోవిచ్, ఆండ్రీ రూబ్లెవ్ మధ్య జరగాల్సిన మ్యాచ్​ను నిర్వాహకులు రద్దు చేశారు. మరోవైపు జొకోవిచ్ ఫిట్​నెస్​ కోచ్ కూడా కరోనా బారిన పడినట్లు సమాచారం. డోమ్నిక్ థీమ్, అలెగ్జాండర్ జ్వరెవ్ కూడా ఈ టోర్నీలో పాల్గొన్నట్లు సమాచారం.