Breaking News

డోనాల్డ్ ట్రంప్ కు కరోనా

డోనాల్డ్ ట్రంప్ కు కరోనా

  • ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కు కూడా..
  • క్వారంటైన్ కి వెళ్లిన యూఎస్ అధ్యక్షుడు
  • త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ట్వీట్

న్యూయార్క్: మరికొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగలింది. ట్రంప్ తో పాటు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. నిత్యం ట్రంప్​ వెన్నంటే ఉండే ఆయన సలహాదారుడు హోప్ హిక్స్ కు కరోనా నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన శ్వేతసౌధం సిబ్బంది ముందస్తు చర్యల్లో భాగంగా ట్రంప్, మెలానియా కు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో వారిద్దరికి కరోనా వచ్చిందని తేలింది. దీంతో వారిరువురూ క్వారంటైన్ కి వెళ్లారు.

కాగా, అమెరికాలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ట్రంప్​ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అసలు కరోనాకు భయపడాల్సిన పనిలేదని, అంతేగాక తాను మాస్క్ ధరించనని కూడా ఆయన కరాఖండిగా చెప్పేశారు. దీని గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా చైనాను నిందించేవారు. అలాంటి ట్రంప్ కు తాజాగా కరోనా సోకడంతో ఆయనకు షాక్ తగిలింది. ఇదిలా ఉండగా మరికొద్ది రోజుల్లో తెరలేవనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ముహూర్తానికి ముందే కరోనా సోకడంతో అది ఆయనకు రాజకీయంగా నష్టాన్ని చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వచ్చిన పలు సర్వేల్లో.. ఆయన అధ్యక్ష రేసు నుంచి వెనకబడ్డారని వెల్లడిస్తున్నాయి. తాజా పరిణామాలతో ట్రంప్ మరింత కంగుతినడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలాఉండగా, ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆయన ప్రియమిత్రుడు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ట్రంప్ కు కరుణా సోకిందని తెలియగానే ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోడీ తో పాటు పలు దేశాల అధినేతలు కూడా వారిరువురూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.