Breaking News

కరోనా.. ఆపతరమా?

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. హైదరాబాద్‌ నగరంలో అయితే దాని దూకుడును అడ్డుకోవడం ఎవరి తరమూ కావడం లేదు. నెల రోజుల క్రితం వరకు తక్కువ కేసులు నమోదయ్యాయి. కానీ, ఇటీవల విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకు 800 మందికి పైగా కరోనా బారినపడుతున్నారు. ఒక్కసారిగా కేసులు పెరగడానికి కారణం ఏమిటా అన్న ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తోంది. అయితే, కరోనా విజృంభణ అప్పుడు కూడా బాగానే ఉందని, అయితే, పరీక్షలు తక్కువగా చేయడం వల్ల తక్కువ మందికి సోకినట్టుగా ఫలితాలు వచ్చాయని వైద్యసిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కోర్టులు, కేంద్రం నుంచి ఒత్తిడి రావడంతో ఇటీవల కాలంలో తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. దీంతో భారీస్థాయిలో కేసులు బయటపడుతున్నాయి.

వాస్తవానికి కరోనా తీవ్రత చాలా ఉందని, ఏపీలో లాగానే ఇక్కడ కూడా ర్యాండమ్‌ టెస్టులు చేయాలని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశాయి. ఆందోళనలు కూడా చేశాయి. కానీ, ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు. పైగా అందరికీ టెస్టులు చేయాల్సిన అవసరం లేదని, ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారమే టెస్టులు నిర్వహిస్తున్నామని, ఈ నిబంధనల ప్రకారం మరణించిన వారికి కూడా టెస్టులు చేయొద్దని, కరోనా బాధితుడి కుటుంబ సభ్యులకు కూడా లక్షణాలు లేకుంటే టెస్టులు అవసరం లేదని చెప్పింది.

లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత

ప్రజల్లో అంతర్లీనంగా ఉన్న ఈ వైరస్‌ లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత జనం రోడ్డమీదకు రావడంతో ఒక్కసారిగా విజృంభించింది. దీనికి తోడు టెస్టుల సంఖ్య పెంచాలని కేంద్రం, కోర్టులు గట్టిగా మొట్టికాయ వేయడంతో ప్రభుత్వం ఇప్పుడు టెస్టుల సంఖ్యను పెంచింది. ఈ తరుణంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మంగళవారం 3006 మందికి టెస్టులు చేస్తే 870 మందికి పైగా పాజిటివ్‌ సోకినట్టు తేలింది. అంటే కేవలం 3వేల మందికి టెస్టులు చేస్తేనే ఇంతమందికి పాజిటివ్‌ వస్తే ఏపీలో మాదిరిగా రోజుకు 16వేల టెస్టులు చేస్తే ఎంతమంది బయటపడతారోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. పైగా అన్ని రాష్ట్రాల్లో కంటే వైరస్‌ వ్యాప్తి వేగం తెలంగాణలో ఎక్కువగా ఉంది. అది ఇక్కడ 122శాతంగా ఉంటే, ఏపీలో కేవలం 7శాతం మాత్రమే ఉందని వైద్యనిపుణలు వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇంత తేడా రావడానికి కారణం టెస్టులేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఏపీలో మొదటినుంచి పెద్దఎత్తున టెస్టులు చేయడం వల్ల వ్యాప్తిశాతం అక్కడ తక్కువగా ఉందని, తెలంగాణలో తక్కువ టెస్టులు చేయడం వల్ల ఇప్పుడు వ్యాప్తిశాతం భారీగా పెరిగిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏపీలో చేసినట్టుగానే ముందునుంచీ టెస్టుల సంఖ్య పెంచి ఉంటే ఇప్పుడు ఇంత దారుణ పరిస్థితి వచ్చే ఉండేది కాదేమోనని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఏపీలో లాగా తెలంగాణలో కూడా ఇంటింటికీ వెళ్లి కరోనా పరీక్షలు చేయాలని తెలంగాణవాసులు, వైద్య నిపుణులు కోరుతున్నారు.