Breaking News

ఏపీలోనూ బస్సులు షురూ

  • 70 శాతం సర్వీసులు మాత్రమే: ఏపీఎస్ఆ​ర్టీసీ ఎండీ

సారథి న్యూస్​, విజయవాడ: గురువారం ఉదయం 7 గంటల నుంచి బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నామని ఏపీఎస్ఆ​ర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. నెమ్మదిగా సంస్థ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం మీడియాకు వెల్లడించారు. సిటీ బస్సు సర్వీసులను తర్వాత ప్రారంభిస్తామన్నారు. కరోనా వ్యాప్తి.. లాక్​ డౌన్​ నేపథ్యంలో సమారు రెండు నెలలుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రవాణాపరంగా కొన్ని సడలింపులు ఇవ్వడంతో బస్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర సర్వీసులను నడిపించబోమని స్పష్టంచేశారు. రాత్రిపూట కర్ఫ్యూ ఉంటుందని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రాత్రిపూట కూడా బస్సులను నడుపుతామని తెలిపారు. ప్రయాణికులు బస్టాండ్​ కు రాత్రి ఏడు గంటలలోపే చేరుకోవాలని సూచించారు. 70 శాతం సర్వీసులు అంటే 1,683 బస్సులు మాత్రమే ప్రారంభిస్తున్నామని ఏపీఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. కన్సెషన్ పాసులకు లాక్​ డౌన్​ 4.0 పూర్తయ్యే వరకు అనుమతి లేదన్నారు. ప్రతి బస్టాండ్​లో శానిటైజర్స్ అందుబాటులో ఉంచుతామన్నారు.


నగదు రహిత టికెట్
నగదు రహిత టికెట్ ఇష్యూకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, గూగుల్ పే లాంటి అన్నిరకాల వేలెట్ ల ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. 65 ఏళ్లు దాటిన వారు, 10ఏళ్లలోపు పిల్లలను అత్యవసరమైతేనే (మెడికల్ ఎమెర్జెన్సీ) బస్సులో అనుమతిస్తామన్నారు.

రాయితీ పాస్​లపై కీలక నిర్ణయం
ఏపీఎస్ఆర్టీసీ వివిధ వర్గాల వారికి కల్పిస్తున్న రాయితీ అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, పాత్రికేయులు సహా వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటించాల్సిన నేపథ్యంలో బస్సుల్లో సీట్ల సంఖ్యను ఆర్టీసీ కుదించింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ సహా ఏసీ సర్వీసుల్లోనూ సీట్లను తగ్గించింది. దీంతో ఆర్థికంగా సంస్థకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నందున వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వివరించింది.